సుప్రింకోర్టు ఆదేశాలను నిర్వాహకులు ఏమాత్రం ఖాతరుచేయలేదు.
సుప్రింకోర్టు ఆదేశాలను యధేచ్ఛగా ఉల్లంఘించారు. అటు తమిళనాడులో జల్లికట్టూ ఆగలేదు, ఇటు ఉభయగోదావరి జిల్లాల్లో కోళ్ళపందేలూ ఆగలేదు. తమిళనాడులో అయినా, ఉభయగోదావరి జిల్లాల్లో అయినా సంక్రాంతికి దశాబ్దాలుగా జల్లికట్టు, కోళ్ళపందేలు జరగటం సంప్రదాయం. అయితే, జంతుప్రేమికుల సంస్ధలు వీటి నిర్వహణకు వ్యతిరేకంగా న్యాయస్ధానాలను ఆశ్రయించాయి.
ఎప్పుడైతే సంప్రదాయ వేడుకల్లో న్యాయస్ధానం వేలుపెట్టిందో అప్పటి నుండి సర్వత్రా ఉత్కంఠ మొదలైంది. పైగా ఉభయ రాష్ట్రాల్లోని హైకోర్టులు రెండు సంప్రదాయాలనూ నిషేధించాయి. ఉభయ రాష్ట్రాల్లోని హైకోర్టుల్లో ఇచ్చిన స్టే ఆజ్ఞలను ఎత్తేయాలంటూ ఉభయ రాష్ట్రాల్లోని పలువురు సుప్రింకోర్టును ఆశ్రయించారు. అయితే, నిర్వాహకులకు సుప్రింకోర్టులో ఆశాభంగమైంది.
అటు జల్లికట్టును, ఇటు కోళ్లపందేల నిర్వహణకు అనుమతించేది లేదంటూ సుప్రింకోర్టు స్పష్టం చేసింది. అయితే సుప్రింకోర్టు ఆదేశాలను నిర్వాహకులు ఏమాత్రం ఖాతరుచేయలేదు. తమిళనాడులోని కడలూరులో జల్లికట్టు యధావిధిగా భారీ ఎత్తున జరిగింది. అయితే, విషయం తెలిసిన పోలీసులు జల్లికట్టు జరుగుతున్న ప్రాంతానికి చేరుకుని నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు.
ఇక,మన రాష్ట్రంలో కోళ్ళపందేల సంగతి సరేసరి. దీనికోసం నిర్వాహకులు ఎప్పటి నుండో సర్వం సిద్ధం చేసుకున్నారు. దేశ, విదేశాల నుండి ఉభయగోదావరి జిల్లాలకు పందెం రాయళ్ళు దిగేసారు. దాంతో ఎవరేమనుకున్నా డోంట్ కేర్ అంటూ నిర్వాహకులు మారుమూల గ్రామాల్లో పందేలను షురూ చేసారు.
పోలీసులు వచ్చే సమాచారం తెలిసేందుకు గ్రామాలకు చుట్టూ సొంత భద్రతా, నిఘా ఏర్పాట్లు కూడా చేసుకోవటం గమనార్హం. ఎందుకంటే, కోళ్ళపందేల నిర్వహణలో అన్నీ రాజకీయ పార్టీల నేతలూ ఒకేబాట కాబట్టి. అందుకు జిల్లాల్లోని అధికారులు కూడా యధాశక్తి సహకరిచటం మామూలే.
