వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్: సుప్రీంలో ప్రారంభమైన విచారణ
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ ప్రారంభమైంది.
న్యూఢిల్లీ: కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై మంగళవారం నాడు సుప్రీంకోర్టు విచారణను ప్రారంభించింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఈ నెల 22న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్ విచారణ ను ప్రారంభించింది.
ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం వైఎస్ అవినాష్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను వెకేషన్ బెంచ్ విచారించేలా ఆదేశాలు జారీ చేయాలని వైఎస్ అవినాాష్ రెడ్డి ఆ పిటిషన్ లో కోరారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ నరసింహంలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఇవాళ విచారిస్తుంది.మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ నోటీసులు జారీ చేసినా కూడా కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విచారణకు హాజరు కాలేదు.
ఈ నెల 16, 19, 22న విచారణకు రావాలని సీబీఐ అధికారులు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు. ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల నేపథ్యంలో విచారణకు రాలేనని వైఎస్ అవినాష్ రెడ్డి ఈ నెల 16న విచారణకు హాజరు కాలేదు. అంతేకాదు నాలుగు రోజుల సమయం కావాలని సీబీఐకి లేఖ రాశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వినతి మేరకు ఈ నెల 19న విచారణకు రావాలని సీబీఐ మరోసారి నోటీసులు ఇచ్చింది. అయితే సీబీఐ విచారణకు హాజరయ్యే సమయంలోనే తల్లికి అనారోగ్యంగా ఉందని సమాచారం రావడంతో విచారణకు హాజరు కాకుండా వైఎస్ అవినాష్ రెడ్డి పులివెందులకు వెళ్లారు.
also read:కర్నూల్ కు సీబీఐ మరో టీమ్: విశ్వభారతి ఆసుపత్రి వద్దే వైసీపీ శ్రేణులు
ఈ నెల 19వ తేదీన తల్లి వైఎస్ శ్రీలక్ష్మిని కర్నూల్ విశ్వభారతి ఆసుపత్రిలో చేర్పించారు వైఎస్ అవినాష్ రెడ్డి . ఈ నెల 22న విచారణకు రావాలని సీబీఐ నోటీసులు జారీ చేసింది. అయితే తన తల్లి ఆరోగ్యం మెరుగయ్యే వరకు విచారణకు రాలేనని వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐకి లేఖ రాశారు. అంతేకాదు తాను సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయమై కూడా ఆ లేఖలో ప్రస్తావించారు.