Asianet News TeluguAsianet News Telugu

అమరావతి ఆర్-5 జోన్‌పై ప్రతివాదులకు నోటీసులు: స్టేఎత్తివేతకు నిరాకరించిన సుప్రీంకోర్టు

అమరావతి ఆర్-5 జోన్ వ్యహరంపై  ప్రతివాదులకు  సుప్రీంకోర్టు  నోటీసులు జారీ చేసింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఎత్తివేసేందుకు  నిరాకరించింది.

 Supreme Court  Adjourns  Amaravathi  R-5 zone  Case  to Novermber lns
Author
First Published Sep 1, 2023, 3:20 PM IST | Last Updated Sep 1, 2023, 3:37 PM IST

న్యూఢిల్లీ: అమరావతి ఆర్-5 జోన్ వ్యవహరంపై ప్రతివాదులకు సుప్రీంకోర్టు శుక్రవారంనాడు నోటీసులు జారీ చేసింది. ఈ విషయమై  ఏపీ హైకోర్టు  ఇచ్చిన స్టే ఎత్తివేసేందుకు  సుప్రీంకోర్టు నిరాకరించింది.  ఈ పిటిషన్ పై విచారణను  ఈ ఏడాది నవంబర్ కు వాయిదా వేసింది  సుప్రీంకోర్టు.

 కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణం కోసమే ఈ ప్రాజెక్టు చేపట్టినట్టుగా ఏపీ ప్రభుత్వ  తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. పట్టాలు  పంపిణీ చేసి ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు  ప్రభుత్వం  సంకల్పించిందని  ప్రభుత్వ తరపు న్యాయవాది  ఉన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకు వచ్చారు.ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై  ఏపీ హైకోర్టు స్టే ఇచ్చిన విషయాన్ని  ప్రభుత్వ తరపు న్యాయవాది  సుప్రీంకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు.ఆర్-5 జోన్ పై  హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై స్టేకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 
ఈ పిటిషన్ కు గతంలో  అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి  ఏమైనా  సంబంధం ఉందా అని సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం  ప్రశ్నించింది. ఎలాంటి సంబంధం లేదని  ఏపీ ప్రభుత్వ తరపు న్యాయవాది సుప్రీంకోర్టు ధర్మాసనానికి తెలిపారు. ఇది అమరావతిలోనే ఉంది కదా అని  సుప్రీంకోర్టు ధర్మాసనం అడిగింది. ఈ పిటిషన్ పై విచారణకు అనేక అంశాలతో ముడిపడి ఉందని  సుప్రీంకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. దీనిపై  స్టే ఇవ్వడం సాధ్యం కాదని  ఉన్నత న్యాయస్థానం తెలిపింది.   ఈ  ఏడాది నవంబర్ మాసానికి ఈ పిటిషన్ పై విచారణను  వాయిదా వేస్తామని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. ఈ లోపుగా ప్రతివాదులు తమ కౌంటర్లను దాఖలు చేయాలని  సూచించింది. ప్రతి వాదులు కౌంటర్ దాఖలు చేసిన మూడు వారాలకు  రాష్ట్ర ప్రభుత్వం రీజాయిండర్ దాఖలు చేసేందుకు  అవకాశం కల్పించింది  సుప్రీంకోర్టు. 

ఆర్-5 జోన్ కు, అమరావతి పిటిషన్లకు మధ్య వ్యత్యాసం ఏమిటని  సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. ఈ విషయమై ప్రభుత్వం,  రైతుల తరపు న్యాయవాదుల నుండి సమాచారం తెలుసుకుంది.

ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై  ఈ ఏడాది ఆగస్టు  3న  ఏపీ హైకోర్టు స్టే ఇచ్చింది. ఇళ్ల నిర్మాణాన్ని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.  అమరావతి ఆర్-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణానికి  ఏపీ సీఎం వైఎస్ ఈ ఏడాది జూలై 24న శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే.

also read:జగన్ సర్కార్ కు షాక్: ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే

ఆర్-5 జోన్ లో  47, 516 ఇళ్ల నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం  శ్రీకారం చుట్టింది. గుంటూరు, పెద్దకాకాని, విజయవాడ, దుగ్గిరాల,  మంగళగిరి, తాడేపల్లి మండలాలకు చెందిన పేదలకు ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం  తలపెట్టింది.  ఆర్-5 జోన్ లో ఇతర ప్రాంతాల వారికి ఇళ్లు నిర్మించవద్దని  అమరావతి రైతులు హైకోర్టును  ఆశ్రయించారు.ఈ విషయమై  ఇరు వర్గాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు ఇళ్ల నిర్మాణంపై స్టే ఇచ్చింది. ఏపీ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో  ఏపీ ప్రభుత్వం  సవాల్ చేసింది.  ఈ పిటిషన్ పై  ఇవాళ సుప్రీంకోర్టు విచారించింది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios