అమరావతి: ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చెప్తున్న ఒకే ఒక్కమాట అవినీతి రహిత పాలన అందిస్తాం. అవినీతి ఆరోపణలపై దర్యాప్తులు చేస్తాం. ప్రతీ ప్రాజెక్టును జ్యూడీషయల్ విచారణ తర్వాతే అనుమతిస్తాం అంటూ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. 

అవినీతిపై పదేపదే హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక నేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయి. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితులైన సుజనాచౌదరి, సీఎం రమేష్ లో అయితే విపరీతమైన టెన్షన్ నెలకొందట. 

ఇప్పటికే సీబీఐ, ఇన్ కం ట్యాక్స్, ఈడీ దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నరాజ్యసభ సభ్యుడు సుజనాచౌదరి అందరికంటే ముందే జాగ్రత్త పడ్డారని తెలుస్తోంది. లోక్ సభలో టీడీపీ ప్రాతినిథ్యం కేవలం 3 స్థానాలకే పరిమితం కావడం, ఏపీలో ప్రతిపక్ష హోదాతోనే సరిపెట్టుకోవడంతో భవిష్యత్ పై ఆలోచనలో పడ్డారట.

 రెండు చోట్ల అధికారానికి దూరంగా ఉండటంతో కేసులు తమను ఎక్కడ చుట్టుముట్టుతాయనో ఆందోళన చెందిన ఆ నేతలు తొందరగా మేల్కొన్నారని తెలుస్తోంది. ఒకవేళ టీడీపీలోనే కొనసాగిన భవిష్యత్ లో కేసులు ఎదుర్కోవాలంటే కేంద్రంతో సఖ్యత ఉండాలని భావించారు. 

ఎన్నికల ప్రచారంలో కేంద్రంతో చంద్రబాబు ఢీ అంటే ఢీ అనడంతో ఆయనకు కేంద్రం మెుండి చేయి చూపించే అవకాశం ఉందని, సహాయ నిరాకరణే తప్ప సహాయం చేసే పరిస్థితి ఉండదని గ్రహించిన సుజనాచౌదరి పార్టీ మార్పుపై ఆలోచనలపై పడ్డారట.  

అందువల్లే ఎన్నికల్లో గెలిచిన తర్వాత నుంచి చంద్రబాబు నాయుడుకు కాస్త దూరంగా ఉంటూనే వచ్చారు సుజనా. అంతేకాదు ఎన్నికల ఫలితాల అనంతరం సుజనాచౌదరి ఇళ్లపై సీబీఐ దాడులు జరిగాయి. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే అయిదేళ్లు గడ్డుకాలమేనని భావించిన వారు పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.  

ఇకపోతే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడుకు అత్యంత నమ్మకస్తుడు సీఎం రమేష్ ఒకరు. చంద్రబాబుకు నమ్మకస్తుడుగా ఉండటంతో రెండోసారి కూడా రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చారు. ఎన్నికల సమయయంలో సీఎం రమేష్ ఇళ్లపై కూడా ఐటీ దాడులు జరిగాయి.  

వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత టీడీపీ సీనియర్ నేత వరదరాజుల రెడ్డి సైతం సీఎం రమేష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీఎం రమేష్ అత్యంత అవినీతిపరుడని, సీఎం రమేష్ చేపట్టిన పనులపై సీబీఐ విచారణ జరిపించాలంటూ సీఎం జగన్ కు విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే.  

సొంత పార్టీ నేతల నుంచే ఇంతటి ఘాటు ఆరోపణలు వస్తే అధికార పార్టీ ఊరుకుంటుందా అని భావించిన సీఎం రమేష్ భవిష్యత్ కార్యచరణపై పునరాలోచనలో పడ్డారు. ఒకవైపు సొంతపార్టీ నేతల తిరుగుబాటు మరోవైపు సీఎం జగన్ అవినీతిపరుల తాట తీస్తాం అంటూ మైకుల ముందు ఊదరగొడుతుండటంతో చేసేది లేక పార్టీ ఫిరాయించాలనుకున్నారట.
 
ఇదిలా ఉంటే వైయస్ జగన్ సీఎం అయిన తర్వాత జరిపిన రివ్యూలలో సర్వశిక్షా అభియాన్ లో భారీ స్కాం జరిగిందని గుర్తించినట్లు వార్తలు వచ్చాయి. ఆ స్కాంలో కీలక పాత్ర సీఎం రమేష్ అంటూ ప్రచారం జరిగింది. దీంతో ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్నారంటూ ప్రచారం జరుగుతోంది.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, బీజేపీ నేతలు అవినీతి ఆరోపణలతో ఉక్కిరి బిక్కిరి చేశారు. టీడీపీ అధికారంలో ఉండటం కేంద్రంతో ఆనాడు చంద్రబాబు సఖ్యతగా ఉన్న నేపథ్యంలో బతికి బట్టగట్టగలిగారు. 

ఎన్డీఏతో ఎప్పుడైతే విబేధించారో ఆనాటి నుంచి చంద్రబాబుకు రైట్ అండ్ లెఫ్ హ్యాండ్స్ అయిన సుజనాచౌదరి, సీఎం రమేష్ లను ప్రధాని నరేంద్రమోదీ టార్గెట్ చేశారంటూ ప్రచారం కూడా జరిగింది. 

రెండోసారి కూడా ప్రధాని నరేంద్రమోదీ అధికారంలోకి రావడం, ఏపీలో వైయస్ జగన్ సీఎం కావడంతో తమ పుట్టుమునుగుతుందని గ్రహించిన సీఎం రమేష్, సుజనాచౌదరిలు వ్యూహాత్మకంగా బీజేపీలో చేరిపోయారంటూ ప్రచారం జరుగుతోంది. 

ఆంధ్రప్రదేశ్ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిరోజులు ఓపిక పట్టి ఉంటే ఈ పరిస్థితి నెలకొని ఉండేది కాదని ప్రచారం జరుగుతోంది. వైయస్ జగన్ తొందరపడకపోతే వాళ్లు కొద్దిరోజులు టీడీపీలో ఉండేవారట. టీడీపీలో నెలకొన్న రాజకీయ శూన్యతను పసిగట్టిన బీజేపీ దాన్ని క్యాష్ చేసుకుని పార్టీని బలోపేతం చేసుకునేందుకు స్కెచ్ వేసింది. 

ఇంతలో రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి, సీఎం రమేష్ ల ఒత్తిడిని గమనించి ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. దీంతో వారిద్దరితోపాటు మరో ఇద్దరి కాషాయిపార్టీలో చేరిపోయారు. సీఎం జగన్ ఆ ఒక్కమాట అనకపోయి ఉంటే ఈ పరిస్థితి వేరేలా ఉండేదంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. 

ఈ వార్తలు కూడా చదవండి

సిఎం రమేష్ ను ఆటాడుకుంటున్న నెటిజన్లు