ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేతలు చంద్రబాబునాయుడు, పవన్ కళ్యాణ్‌లు టీటీడీపై చేస్తున్న అసత్య ఆరోపణలను బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి కొట్టిపారేశారు. వారు టీటీడీపై తప్పుడు ఆరోపణలు చేస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఫైర్ అయ్యారు. 

బీజేపీ సీనియర్ లీడర్ సుబ్రమణ్య స్వామి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌లు హిందు మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. వారు మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకోరాదని, రాజకీయాలకే పరిమితం కావాలని సూచించారు. ఇష్టానుసారంగా టీటీడీ కార్యక్రమాలపై ఆరోపణలు చేయడం సబబు కాదని హితవు పలికారు. ఈ ఆరోపణల నేపథ్యంలో టీటీడీ తనను ఆశ్రయించి సహాయం చేయాలని కోరగా.. ఒక్క పైసా ఆశించకుండా వ్యక్తిగత స్థాయిలో సహాయం చేయడానికి అంగీకరించానని సుబ్రమణ్య స్వామి వెల్లడించారు.

తనకు న్యాయ శాస్త్రంలో ఉనన అనుభవం, పరిజ్ఞానంతో టీటీడీకి సహాయం చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సహాయం చేస్తానని వివరించారు. 

Also Read: డబ్బుల వెంట పరుగులు పెట్టి లైఫ్ బోర్ కొట్టింది.. ట్రక్కు డ్రైవర్‌గా కంపెనీ సీఈవో

టీటీడీపై అబద్ధాలను ప్రచురిస్తున్న పత్రికపై పరువునష్టం పిటిషన్ వేయనున్నట్టు ఆయన వెల్లడించారు. తాను వ్యక్తిగత స్థాయిలో ఈ న్యాయ పోరాటం చేయనున్నట్టు తెలిపారు. టీడీపీ, జనసేనలు టీటీడీపై ఇష్టం వచ్చినట్టు ఆరోపణలు చేస్తున్నారని వివరించారు. తితిదేపై ఆరోపణలు చేయడమంటే.. హిందూ మనోభావాలను దెబ్బతీయడమే అని అన్నారు.

శ్రీ వాణి ట్రస్ట్ కింద వసూలు చేసిన నిధులను అధికార పార్టీ నేతలు దోచుకుంటున్నారని ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆరోపణలు చేశాయని, అవి అవాస్తవాలని కొట్టిపారేశారు. అంతేకాదు, త్వరలోనే తానే స్వయంగా శ్రీవాణి ట్రస్ట్ టికెట్ తీసుకుని స్వామి వారి దర్శనం చేసుకుంటానని చెప్పారు. శ్రీవాణి ట్రస్ట్ రసీదు సరైనదేనని చెప్పడానికే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.