విశాఖఫట్టణం: విశాఖపట్టణంలో శ్రీకాంత్ అనే యువకుడికి శిరోముండనం చేసిన కేసులో నూతన్ నాయుడిని అరెస్ట్ చేసినట్టుగా సీపీ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు.

శుక్రవారం నాడు విశాఖపట్టణంలో సీపీ మనీష్ కుమార్ సిన్హా మీడియాతో మాట్లాడారు.శ్రీకాంత్ అనే యువకుడికి శిరోముండనం చేసిన కేసులో  నూతన్ నాయుడి భార్య ప్రియా మాధురిని అరెస్ట్ చేసినట్టుగా ఆయన గుర్తు చేశారు. కర్ణాటకలోని ఉడిపిలో ఉన్న నూతన్ నాయుడిని అరెస్ట్ చేసినట్టుగా సీపీ చెప్పారు.

also read:విశాఖ శిరోముండనం బాధితుడు శ్రీకాంత్‌కి బాబు ఫోన్: అండగా ఉంటామని హామీ

శ్రీకాంత్ కు శిరోముండనం చేసిన రోజున ఆరు సెల్ ఫోన్లను సీజ్ చేసినట్టుగా ఆయన చెప్పారు. ముంబైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ నూతన్ నాయుడు తమకు పట్టుబడినట్టుగా సీపీ తెలిపారు. శిరోముండనం చేసే ముందు.. ఆ తర్వాత నూతన్ నాయుడితో భార్య ప్రియ ఫోన్లో మాట్లాడినట్టుగా సీపీ చెప్పారు.

శిరోముండనం జరిగిన రోజున ఇంట్లో దొరికిన సీసీటీవీ పుటేజీతో పాటు ఇతర వాటి ఆధారంగా దర్యాప్తు చేశామని ఆయన గుర్తు చేశారు. ఈ కేసులో ఇప్పటికే కొందరిని అరెస్ట్ చేశామన్నారు.

మరో వైపు రిటైర్డ్ ఐఎఎస్ అధికారి పీవీ రమేష్ పేరుతో ముగ్గురికి నూతన్ నాయుడు ఫోన్ చేసినట్టుగా తమకు దృష్టికి వచ్చిందన్నారు. విశాఖలో ఓ డాక్టర్ కు రిటైర్డ్ ఐఎఎస్ అధికారి రమేష్ పేరుతో చేసిన ఫోన్  విషయమై ఆయన దృష్టికి వచ్చిందన్నారు. దీంతో పీవీ రమేష్ తనకు ఈ విషయమై ఫోన్ చేసినట్టుగా సీపీ తెలిపారు.

పీవీ రమేష్ పేరుతో నూతన్ నాయుడే ఫోన్ చేశారని తమ దర్యాప్తులో తేలిందన్నారు.