Srikakulam Stampede : కాశీబుగ్గలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన యావత్ రాష్ట్రాన్ని కలచివేసింది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరక్కుండా ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంటోంది. 

Srikakulam Stampede : సామాన్య భక్తుల ప్రాణాలను బలితీసుకున్న శ్రీకాకుళం తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ప్రభుత్వం విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజల ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నిస్తుంటే కొందరు ప్రైవేట్ వ్యక్తులవల్ల ఇలాంటి దుర్ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. కాశీబుగ్గ వెంకటేశ్వస్వామి ఆలయంలో తొక్కిసలాటకు నిర్వహకులు నిర్లక్ష్యమే కారణమని స్పష్టంగా అర్థమవుతోంది. కాబట్టి ఈ ఘటనకు కారకులైన వారిపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని... తక్షణమే కస్టడీలోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

మొంథా తుపాను సమయంలో పకడ్బందీగా వ్యవహరించి ప్రాణనష్టం జరక్కుండా జాగ్రత్తపడ్డాం... కానీ కొందరి నిర్లక్ష్యం వల్ల ఇంతమంది ప్రాణాలు పోవడం బాధాకరమని అన్నారు. ప్రైవేటు వ్యక్తి నిర్మించిన ఆలయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకోవటం విచారకమని అన్నారు. ముందుగానే పోలీసులకు లేదంటే దేవాదాయ శాఖకు సమాచారం అందించివుంటే ఇంత ఘోరం జరిగివుండేది కాదన్నారు... క్యూలైన్లలో భక్తులను నియంత్రించేందుకు అవకాశం ఉండేదన్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడినవారిపై కఠిన చర్యలుంటాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు.

Scroll to load tweet…

తొక్కిసలాటపై దేవాదాయ శాఖ మంత్రి రియాక్షన్

ఇదిలావుంటే తొక్కిసలాట జరిగిన కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులు అధీనంలో ఉందని దేశాదాయ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి కూడా తెలిపారు. ఈ దురదృష్టకర ఘటనలో ఎక్కడా దేవాదాయశాఖ, ప్రభుత్వ నిర్లక్ష్యం లేదని మంత్రి స్పష్టం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తక్షణ చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

కార్తీకమాసం సందర్భంగా ఇంతమంది భక్తులు వచ్చినా నిర్వహకులు దేవాదాయ శాఖకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని మంత్రి ఆనం తెలిపారు. ముందుగా సమాచారం అందించివుంటే ఇలాంటి ఘటనలు జరక్కుండా జాగ్రత్త పడేవారిమని అన్నారు. ఇకపై ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో నడుస్తున్న ఆలయాలపై ప్రత్యేక దృష్టి పెడతామని.. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి స్పష్టం చేశారు.

తొక్కిసలాట ఘటనాస్థలికి అచ్చెన్నాయుడు

స్వయంగా మంత్రి అచ్చెన్నాయుడు, స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీషతో పాటు అధికారులు, స్థానిక నాయకులు సహాయక చర్యలు చేపడుతున్నట్లు దేవాదాయ మంత్రి వెల్లడించారు. క్షతగాత్రులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. ప్రభుత్వం తరపున బాధితులకు అన్ని రకాల సహాయసహకారాలు అందిస్తామని మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి భరోసా ఇచ్చారు.