ప్రత్యేకహోదా కోసం ఎంపిల రాజీనామా కేంద్రాన్ని హెచ్చరించిన జగన్ చంద్రబాబు నాటకాలాడుతున్నారు
బడ్జెట్ సమావేశాల లోపు కేంద్రప్రభుత్వం ఏపికి ప్రత్యేకహోదా ప్రకటించకపోతే తమ పార్టికి చెందిన పార్లమెంట్ సభ్యులతో రాజీనామాలు చేయిస్తానని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెచ్చరించారు. మంగళవారం కర్నూలులోని పాతపట్నంలో ప్రత్యేకహోదాపై విద్యార్ధులతో యువభేరి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో దేన్ని కూడా నిలుపుకోని ముఖ్యమంత్రి చంవద్రబాబునాయడు రాష్ట్ర ప్రజలను దారుణంగా వంచిస్తున్నట్లు ఆరోపించారు.
ఎన్నికల సమయంలో రాష్ట్రాభివృద్ధికి 15 ఏళ్ళ పాటు ప్రత్యేకహోదా కావాలని డిమాండ్ చేసిన చంద్రబాబు ఇపుడేమో అదే ప్రత్యేకహోదాపై తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు ధ్వజమెత్తారు. కేంద్రం ఇటీవలె ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజిలో ఏముందో కూడా తెలుసుకోకుండానే బ్రహ్మాండమన్న చంద్రబాబు కేంద్రమంత్రులు వెంకయ్యనాయడు, అరుణ్ జైట్లీని సన్మానించటం సిగ్గుచేటన్నారు. భారతీయ జనతా పార్టీ, టిడిపి నాయకులు కనిపిస్తే ప్రత్యేకహోదాపై నిలదీయాలని పిలుపునిచ్చారు.
ఏపికి కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించిన ప్యాకేజిని స్వాగతించిన చంద్రబాబుకు అసలు ప్యాకేజి అంటే ఏమిటో తెలుసా అని ప్రశ్నించారు. పార్లమెంట్ సాక్షిగా ఏపి అభివృదిధికి ఇచ్చిన హామీని ఎన్ డిఏ ప్రభుత్వం గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు మొహం చాటేసినట్లు దుయ్యబట్టారు. ఎన్నాళ్ళు బతికామన్నది కాదని..ఎలా బతికామన్నదే ముఖ్యమన్నది తన సిద్దాంతమన్నారు. హోదా ఉన్న రాష్ట్రాలకే పారిశ్రామిక రాయితీలు వస్తాయని జగన్ స్పష్టం చేసారు.
రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తే 90 శాతం నిధులు గ్రాంట్ల రూపంలో వస్తాయన్నారు. ప్రత్యేకహోదా కలిగిన రాష్ట్రాలకు మాత్రమే పారిశ్రామిక రాయితీలు అందుతాయని చుప్పారు. ఒకసారి రాష్ట్రానికి పారిశ్రామిక రాయితీలు వస్తే చంద్రబాబు పరిశ్రమల ఏర్పాటు కోసం విదేశాలు తిరగాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. ఇప్పటికి 16 సార్లు విదేశాలకు వెళ్ళి వచ్చిన సిఎం ఏమి ఒరిగిందని ప్రశ్నించారు. హోదా వస్తే ఎక్సైజ్ డ్యూటి, ఆదాయపు పన్ను కొంత కాలం వరకూ కట్టాల్సి అవసరం ఉండదని చెప్పిన జగన్ ప్రత్యేకహోదా సాధించే వరకూ నిరంతర పోరాటం చేస్తూనే ఉంటామని ప్రకటించారు.
