రాజకీయాలకు సోనియా గుడ్ బై

First Published 15, Dec 2017, 2:46 PM IST
Sonia Gandhi retires from politics
Highlights
  • ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధి సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధి సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పేశారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన రాహూల్ గాంధి బాధ్యతలు తీసుకునే ముందు సోనియా హటాత్తుగా రాజకీయాల నుండి తప్పుకోవటం గమనార్హం.

శుక్రవారం పార్లమెంటు సమావేశాలకు సోనియా హాజరయ్యారు. సమావేశాలు వాయిదా పడిన తర్వాత కొద్దేసేపు మీడియాతో ముచ్చటించారు. రాహుల్ బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో సోనియా బాధ్యతలపై ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ ‘తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు’ చెప్పారు. దాంతో అక్కడున్న వారు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

19 ఏళ్లు అధ్యక్షురాలిగా సోనియా గాంధీ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షులుగా ఇన్ని సంవత్పరాల పాటు సేవలందించిన వారు మరోకరు లేరు.  ఎక్కువకాలం పార్టీ బాధ్యతలు భుజాన మోసిన అధినేత్రిగా ఆమె రికార్డ్ సృష్టించారు.

సోనియా గాంధీ 1946 డిసెంబర్ 9న ఇటలీలో జన్మించారు. విద్యాభ్యాసం కొంతకాలం ఇటలీలోనూ తర్వాత ఇంగ్లాండ్ లోను సాగింది. అక్కడే మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధితో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా ప్రేమగా మారి చివరకు వివాహానికి దారితీసింది. తర్వాత ఇందిరాగాంధి మరణంతో రాజీవ్ గాంధి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అదికారం కోల్పోయింది. 1991 ఎన్నికల సందర్భంగా ప్రచారం నిమిత్తం రాజీవ్ గాంధి తమిళనాడులోని శ్రీ పెరుంబదూరుకు వెళ్ళటం అక్కడ ఎల్టీటీఈ ఆత్మాహుతి దాడిలో మరణించటం అందరికీ తెలిసిందే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవగా పివి నరసింహారావు ప్రధానమంత్రి, కాంగ్రెస్ అధ్యక్షునిగా బాద్యతలు స్వీకరించారు.

అయితే, తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. అప్పటి వరకూ తెర వెనక్కే పరిమితమైన సోనియా చివరకు క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. తర్వాత 1998 మార్చి 14న పార్టీ బాధ్యతలు స్వీకరించారు.  2003 చివరలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ గెలిచింది. దాంతో 2004 నుండి లోక్ సభలో యూపీఏకు అధ్యక్షురాలుగా వ్యవహరిస్తున్నారు.

2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆమె ప్రధానమంత్రి అయ్యే అవకాశం తృటిలో తప్పిపోయిన సంగతి అందరికీ తెలిసిందే.  దాంతో మన్మోహన్ సింగ్ ప్రధాని అయ్యారు. 185 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి స్వాతంత్ర్యం రాకముందు కొంతమంది విదేశీయులు అధ్యక్షులుగా ఉన్నారు. కానీ స్వాతంత్ర్యం వచ్చాక తొలి విదేశీ అధ్యక్షురాలు మాత్రం సోనియా గాంధీనే.

 

loader