మౌలిక సదుపాయాల కల్పనను విస్మరించి నోబెల్‌ బహుమతి వంటి అత్యున్నత పరస్కారాలను ఆశించడం అత్యాసన్నారు.
తెలుగు విద్యార్ధులెవరైనా నోబెల్ ప్రైజ్ తెస్తే రూ. 100 కోట్లు ఇస్తానని చంద్రబాబు చేసిన ప్రకటనకు ఓ శాస్త్రవేత్త గాలి తీసేసారు. నోబెల్ బహుతి తీసుకొచ్చే ఆంధ్రుడికి రూ.100 కోట్ల బహుమతి ఇస్తానని తిరుపతిలో సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో సిఎం ప్రకటించారు. అయితే, సిఎం ప్రకటనపై పలువురు శాస్త్రవేత్తలు పెదవి విరుస్తున్నారు.
సైన్స్ కాంగ్రెస్లో గురువారం సైన్స్ అచీవర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రతిష్టాత్మక భట్నాగర్ అవార్డు గ్రహీత, ఇక్రిశాట్ శాస్త్రవేత్త డాక్టర్ రాజీవ్ కుమార్ వర్షి మాట్లాడుతూ రూ.100 కోట్ల బహుమతి ప్రకటనను తప్పుపట్టారు. ప్రైజ్ మనీని ప్రకటించిన సిఎం ‘నోబెల్’ గెల్చుకోడానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించారా అంటూ ప్రశ్నించారు
రాష్ట్రంలోని చాలా పాఠశాలల్లో ప్రయోగశాలలే లేని విషయాన్ని ప్రస్తావించారు. ప్రైవేట్ పాఠశాలల సంగతి చెప్పనవసరమే లేదన్నారు. ఇంటర్మీడియట్ కాలేజీల్లో మరీ అధ్వానమని పేర్కొన్నారు. సైన్స్ ల్యాబ్లు లేని కారణంగా ప్రయోగాలు జరగటమే లేదని వాపోయారు.
విద్యాసంస్థల్లో ప్రయోగ శాలలు ఏర్పాటు చేయకుండా శాస్త్ర పరిశోధనల్లో రాణించడం అసాధ్యమన్నారు. మౌలిక సదుపాయాల కల్పనను విస్మరించి నోబెల్ బహుమతి వంటి అత్యున్నత పరస్కారాలను ఆశించడం అత్యాసన్నారు. ఇదే అభిప్రాయాన్ని మరికొంత మంది ప్రతినిధులు కూడా వ్యక్తం చేయటం గమనార్హం.
కనీసం మండలానికి ఒకటైనా ఉన్నత స్థాయి ప్రయోగశాల ఏర్పాటు చేయడం పెద్ద సమస్యకాబోదని అభిప్రాయపడ్డారు. ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజీల్లోనూ ల్యాబ్లను బలోపేతం చేయాలని చెప్పారు. సరైన ప్రణాళికలు లేకుండా రూ. 100 కోట్ల ప్రైజ్ మనీ ప్రకటిస్తే ఉపయోగం ఏమిటని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.
