రాష్ట్రపరిధి తగ్గిపోయింది కాబట్టి ’ముఖ్యులకు‘ వైఎస్ హయాంలో ఉన్నంత అవకాశాలు లేవన్నదే తేడా.

సేమ్ టు సేమ్. ప్రభుత్వం మారింది..పాత్రలు మారాయి. పాత్రధారులు మారారంతే. పద్దతి మాత్రం ఒకటే. అదే దోపిడి. జల దోపిడి. కాల్వలు, ప్రాజెక్టులు పేరు చెప్పటం అందినంత ప్రజాధనాన్ని దోచుకోవటం. ‘కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డునాకింద’నేది సామెత. మిగిలినదంతా సేమే. అధికారంలోని తెలుగుదేశం పద్దతి అదే విధంగా ఉంది.

2004-09 మధ్య దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో ప్రాజెక్టుల పేరుతో భారీగా దోడిపి జరుగుతోందని ప్రతిపక్ష టిడిపి పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. న్యాయపోరాటాలు చేసింది. జాతీయ స్ధాయిలో ఫిర్యాదులు చేసింది.

ఐదేళ్ళ వైఎస్ హయాంలో జరిగిన కుంభకోణాలు, అవినీతిపై ఏకంగా ‘రాజా ఆఫ్ కరెప్షన్’ అనే పుస్తకాన్నే ప్రచురించింది. ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రితో పాటు పలువురు నేతలకు పంచిపెట్టింది.

అదంతా గతం. సీన్ కట్ చేస్తే 2014లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ప్రాజెక్టుల పేరుతో అక్రమాలు జరుగుతున్నాయంటూ ప్రతిపక్షం వైసీపీ అటువంటి ఆరోపణలే చేస్తోంది.

గాలేరు-నగిరి, హంద్రీ-నీవా, పోలవరం, పట్టిసీమ, కుందు-పెన్నా వరద కాలువ నిర్మాణం, తెలుగు గంగ... ఇలా ప్రాజెక్టులేవైనా అప్పుడు జరిగిందని, ఇపుడు జరుగుతోందని వినిపిస్తున్న ఆరోపణలు భారీ అవినీతేపైనే.

అపుడైనా ఇపుడైనా జరుగుతున్నది ప్రాజెక్టుల అంచనాలు వందలు, వేల కోట్ల మేరకు భారీగా పెరిగిపోవటమే. తమకు కావాల్సిన వారికి కాంట్రాక్ట్ లు అప్పగించేందుకు నిబంధనలను మార్చేయటం, పోటీలో ఉన్న నిర్మాణ సంన్ధలను బయటకు పంపేయటం మామూలే. పనులు జరగకున్నా బిల్లుల చెల్లింపులూ అయిపోతున్నాయి.

కాకపోతే, అప్పుడు సమైక్య రాష్ట్రం కాబట్టి వైఎస్, నీటి పారుదల శాఖ మంత్రి పొన్నాలక్ష్మయ్య, ఉన్నతాధికారులతో పాటు అనేకమంది కాంట్రాక్టర్లపైనా టిడిపి ఆరోపణలు చేసింది.

ఇపుడు సిఎం చంద్రబాబునాయుడు, భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్ రావు, ఉన్నతాధికారులతో పాటు కాంట్రాక్టర్ల పైనా వైసీపీ ఆరోపణలు చేస్తోంది. విచిత్రమేమిటంటే అప్పుడైనా ఇపుడైనా కాంట్రాక్టర్లు పెద్దగా మారింది లేదు.

కాకపోతే వైఎస్ హయాంలో సమైక్య రాష్ట్రం కాబట్టి అక్రమాలకు ఎక్కువ అవకాశాలున్నాయేమో. అదే, ఇపుడు రాష్ట్రపరిధి తగ్గిపోయింది కాబట్టి ’ముఖ్యులకు‘ వైఎస్ హయాంలో ఉన్నంత అవకాశాలు ఉడవనేదే తేడా. మిగితా అంతా సేమ్ టు సేమ్ జరిగేది ప్రజాధనం దోపిడినే. ఎవరికైనా డౌటా ?