హైదరాబాద్‌: తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కేసులో నిందితుడు శ్రీనివాస రావు రాశాడని చెబుతున్న లేఖపై వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్ రావు రాసి జేబులో పెట్టుకున్నాడని చెబుతున్న లేఖ అసలు మడతలు పడలేదని ఆయన అన్నారు. 

జగన్ మీద దాడి అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు షాక్‌కు గురిచేశాయని సజ్జల శుక్రవారం మీడియా సమావేశంలో అన్నారు. వైఎస్‌ జగన్‌పై దాడి జరిగిన గంటలోనే ప్రచార ఆర్భాటంతోనే ఈ ఘటన జరిగిందని డీజీపీ ఎలా ప్రకటన చేస్తారని ఆయన ప్రశ్నించారు. నిష్పక్షపాతంగా విచారణ జరిపించాల్సిన అధికారే ఎలాంటి విచారణ చేయకుండా ప్రకటన చేయడం బాధాకరమని, ఈ ప్రకటన తర్వాతే ఈ ఘటనపై తమకు అనుమానం కలిగిందని ఆయన అన్నారు.

ఘటన జరిగినప్పుడు నిందితుడి దగ్గర లెటర్‌ లేదని, ఆ తర్వాతే తయారైందని ఆయన విమర్శించారు. నిందితుడిపై మధ్యాహ్నం 4.30 గంటలకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని చెప్పారు. ఘటన జరిగిన తరువాత 4 గంటల సమయం ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. నిందితుడి వద్ద దొరికిన లేఖకు సంబంధించిన కాగితాలు మడతలు పడలేదని, ఒక్కో పేజీలో ఒక్కోలా రాసుండటంతో అనేక అనుమానాలు తలెత్తున్నాయని ఆయన అన్నారు. 

అరెస్ట్ చేసి 24 గంటలు గడుస్తున్నా నిందితుడి అరెస్ట్ చూపలేదని తెలిపారు. సీఎం చంద్రబు నాయుడివి చిల్లర రాజకీయాలని మండిపడ్డారు. దాడి ఘటనపై చంద్రబాబు ప్రెస్‌మీట్‌ను చూసి మీడియా వాళ్లకే  విసుగొచ్చిందని వ్యాఖ్యానించారు. రాజకీయ లబ్ధికోసమే చంద్రబాబు తమపై బురద చల్లుతున్నారని విమర్శించారు. 15 ఏళ్ల  పాటు సిఎంగా పనిచేసిన వ్యక్తి ప్రతిపక్షనేతపై దాడి జరిగితే హుందాగా విచారణ జరిపిస్తామని చెబుతారనుకున్నామన్నారు. 

చంద్రబాబు డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని, ఆయన మాటలు వింటుంటే మతి భ్రమించిదేమోననిపిస్తోందని సందేహం కలుగుతోందని సజ్జల అన్నారు. విచారణ జరగకుండా స్టేట్‌మెంట్లు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. గుమ్మడి కాయల దొంగ ఎవరంటే చంద్రబాబు భుజాలు తడుముకుంటున్నారని విమర్శించారు.

జగన్‌పై దాడికి టీడీపీనే సూత్రధారని ఆరోపించారు. కనీస విలువలు పాటించని చంద్రబాబు సీఎం స్థానంలో కొనసాగడానికి అనర్హుడని అన్నారు క్యాంటీన్‌ యజమానిని ఎందుకు విచారించలేదని నిలదీశారు. బాధితులనే కుట్రదారులుగా చూపించే కుయుక్తులు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర పోలీస్‌ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, స్వతంత్ర విచారణ సంస్థతో విచారణ జరిపించాలని సజ్జల డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

నేను చెప్పాలనుకున్నదే లేఖలో రాశా...అది చూసుకోండి: నిందితుడు శ్రీనివాస్

కోర్టుకు శ్రీనివాస్, 9ఫోన్ లు ఒకే సిమ్, మరోకత్తి స్వాధీనం :జగన్ కేసుపై విశాఖ సీపీ లడ్డా

పవన్ కళ్యాణ్ పై దాడికి కుట్ర:కన్నా సంచలన వ్యాఖ్యలు

జగన్‌పై దాడి: వారం పాటు ప్రజా సంకల్ప యాత్రకు బ్రేక్

జగన్ "కేంద్రం"గా చంద్రబాబు రాజకీయం

ఆపరేషన్ గరుడ నమ్మాల్సి వస్తే శివాజీని ప్రశ్నించండి:టీడీపీకి రోజా కౌంటర్