హైదరాబాద్‌: వైసీపీ అధినేత జగన్‌పై దాడి విషయంలో టీడీపీ చేస్తున్న ఆరోపణలకు వైసీపీ ఎమ్మెల్యే ఆర్ కే రోజా కౌంటర్ ఇచ్చారు. ఆపరేషన్ గరుడలో భాగంగానే దాడి జరిగిందని సీఎం నుంచి మంత్రులు వరకు ఆరోపిస్తున్నారని అలాంటప్పుడు సినీనటుడు శివాజీని ప్రశ్నించొచ్చు కదా అంటూ సలహా ఇచ్చారు. 

శివాజీని ప్రశ్నిస్తే నిజాలు బయటడతాయన్నారు. ఆపరేషన్ గరుడలో భాగంగానే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అంటున్న సీఎం చంద్రబాబు, మంత్రులకు రోజా సెటైర్ వేశారు.  రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వమే ఉంది కాబట్టి శివాజీని ప్రశ్నించి వాస్తవాలు రాబట్టాలని సూచించారు. 

మరోవైపు జగన్ పై దాడి కేసులో ఏపీ పోలీసుల విచారణపై తమకు నమ్మకం లేదని ఈ ఘటనపై సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని రోజా డిమాండ్ చేశారు. జగన్ అల్లర్లు సృష్టించాలనుకుంటే విశాఖలోనే ఉండేవారని హైదరాబాద్ వచ్చేవారు కాదన్నారు. 

సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారని రోజా ఎద్దేవా చేశారు. అటు జగన్‌పై దాడి చేసిన నిందితుడు శ్రీనివాసరావును సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది తనిఖీ చేసినప్పుడు దొరకని లేఖ రాష్ట్ర పోలీసులకు ఎలా దొరికిందని రోజా అనుమానం వ్యక్తం చేశారు.