సదావర్తి సత్రం భూములకు మళ్ళీ వేలం వేయక తప్పదా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలానే ఉన్నాయ్. శుక్రవారం సుప్రింకోర్టులో జరిగిన వాదనలు విన్నతర్వాత అవే అనుమానాలు మొదలయ్యాయి. నాలుగు రోజుల క్రితం జరిగిన వేలంపాటలో అత్యధికంగా రూ. 60.30 కోట్లకు సత్యనారాయణ బిల్డర్స్ పాడుకున్న సంగతి అందరికీ తెలిసిందే. అంతుకుముందు ప్రభుత్వం ఏకపక్షంగా ఇదే భూములను రూ. 22 కోట్లకు కట్టబెట్టింది.  ఎప్పుడైతే విషయం బయటపడిందో వెంటనే వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి కోర్టులో కేసు వేసారు. తర్వాత అనేక మలుపులు తిరిగిన కేసు చివరకు చెన్నైలో వేలం పాట వరకూ సాగింది.

అయితే, వేలం పాటలో అత్యధిక ధరకు భూములు పాడుకున్న బిల్డర్ అనూహ్యంగా వెనక్కుతగ్గారు. భూముల విషయంలో లీగల్ సమస్యలున్న కారణంగా తాము డబ్బులు చెల్లించనని స్పష్టంగా ప్రకటించారు. దాంతో రెండో అత్యధిక బిడ్డింగ్ వేసిన (60.25 కోట్లు) చదలవాడ లక్ష్మణ్ కు అవకాశం ఇచ్చారు. శనివారం మధ్యహ్నంలోగా డబ్బులు చెల్లించాలి. ఒకవేళ రెండో బిడ్డర్ కూడా డబ్బులు చెల్లించక పోతే నిబంధనల ప్రకారం వేలంపాటను రద్దుచేసి మళ్ళీ బహిరంగ ప్రకటన ఇచ్చి  వేలం నిర్వంహించాలి. కానీ తాజా వివాదంలో ఏం చేయాలో అధికారులకు అర్ధం కావటం లేదు.

సుప్రింకోర్టులో విచారణ సందర్భంగా జడ్జి కూడా ఇదే ప్రశ్న అడిగినపుడు అధికారులేమీ సమాధానం చెప్పలేకపోయారు. రెండో అత్యధిక బిడ్డర్ విషయం కూడా తేల్చేసి నివేదిక సమర్పించమని జడ్జి ఆదేశించారు. విచారణను వచ్చే నెల 6వ తేదీకి వాయిదా వేసారు. విచారణ సందర్భంగా న్యాయవాదులు, అధికారులు చెప్పిన సమాధానాలు విన్న తర్వాత మళ్ళీ రెండోసారి వేలంపాట తప్పదా అన్న అనుమానాలు మొదలయ్యాయి.

అయితే, ఈరోజు స్పష్టంగా తేలిపోయిన అంశమేంటంటే, తమిళనాడు వేసిన పిటీషన్ ను జడ్జి కొట్టేసారు. ‘‘సదావర్తి భూములు తమవం’’టూ తమిళనాడు ప్రభుత్వం కేసు వేసింది కదా? అదే విషయమై జడ్జి మాట్లాడుతూ, ‘‘అసలు సత్రం భూములకు తమిళనాడు ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేద’’ని తేల్చేసారు. మరి, 6వ తేదీ విచారణలో ఏమి తీర్పు చెబుతారో చూడాలి.