ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం (russia ukraine war) నేపథ్యంలో అక్కడ భారతీయ విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విశాఖ జిల్లాకు చెందిన ఓ విద్యార్ధిని ఓ తెలుగు వార్తా సంస్థతో అక్కడి పరిస్ధితిని పంచుకుంది. రాజధాని కీవ్‌ నగరానికి 500కి.మీల దూరంలో తాము వున్నామని.. అక్కడ బాంబు పేలుళ్ల శబ్ధాలు ఇక్కడికి వినిపిస్తున్నాయని శ్రీజ చెప్పింది. 

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం (russia ukraine war) నేపథ్యంలో అక్కడ భారతీయ విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని కీవ్‌లోని ఇండియన్ ఎంబసీ (indian embassy) భారత పౌరులకు హెచ్చరికలు జారీ చేసింది. దేశాన్ని విడిచి వచ్చేందుకు పలువురు భావిస్తున్నా.. టికెట్లు దొరకడం లేదు, దొరికినా వాటిని కొనుగోలు చేసేంత స్తోమత వారి వద్ద వుండటం లేదు. అటు ఉక్రెయిన్‌‌లో చిక్కుకున్న భారతీయుల్లో 300 మంది తెలుగువారు కూడా వున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో విశాఖ జిల్లాకు చెందిన ఓ విద్యార్ధిని ఓ తెలుగు వార్తా సంస్థతో అక్కడి పరిస్ధితిని పంచుకుంది. రాజధాని కీవ్‌ నగరానికి 500కి.మీల దూరంలో తాము వున్నామని.. అక్కడ బాంబు పేలుళ్ల శబ్ధాలు ఇక్కడికి వినిపిస్తున్నాయని శ్రీజ చెప్పింది. చాలా భయంగా వుందని... తమకు కావాల్సిన వస్తువులను ఎవరూ ఇవ్వలేదని వాపోయింది. తామే బయటకు వెళ్లి కావాల్సిన వస్తువులను తెచ్చుకున్నామని... కొంచెం మాత్రమే ఆహారం దొరికిందని ఆమె తెలిపారు. మా ఇంఛార్జి సురక్షితంగా ఉంచుతామని చెబుతున్నారు తప్ప పంపిస్తామని మాత్రం చెప్పడం లేదని శ్రీజ పేర్కొన్నారు. 

కీవ్‌ విమానాశ్రయంలో బాంబుదాడులు జరిగాయని... భూమి అంతా ఒకసారి కంపించినట్టు అనిపించిందని ఆమె చెప్పారు. తాము హాస్టళ్లలో ఉంటున్నామని.. ప్రజలు బయటకు రావడంలేదని శ్రీజ పేర్కొంది. అత్యవసరమైతే మెట్రో అండర్‌ గ్రౌండ్‌కు తీసుకెళ్తామని మా ఇంఛార్జి అంటున్నారని... భారతీయ విద్యార్థులందరినీ ఎవరి ఇళ్లకు వాళ్లను చేర్పించాలని ఆమె డిమాండ్ చేశారు. తనతోపాటు ఇక్కడ తెలుగువారు దాదాపు 300 మంది ఉన్నారని... కొందరు నిన్న, మొన్న వెళ్లిపోయారని, మొత్తంగా 3 వేల నుంచి 4వేల మంది భారతీయులు ఉక్రెయిన్‌లోనే వున్నారని శ్రీజ వెల్లడించారు. విమాన టిక్కెట్లు బుక్‌ చేసుకున్నా రద్దయిపోయాయని.. ఇండియన్ ఎంబసీని సంప్రదిస్తున్నా, ఇంకా స్పందనరాలేదుని ఆమె వాపోయారు. కుటుంబంతో ఎప్పటికప్పుడు టచ్‌లోనే ఉంటున్నానని .. అమ్మా, నాన్న చాలా భయపడుతున్నారని శ్రీజ ఆవేదన వ్యక్తం చేశారు. 

అంతకుముందు ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపుపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. భారతీయుల భద్రతపై భరోసా ఇస్తున్నామని పేర్కొంది. విద్యార్ధులను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్రం వెల్లడించింది. అటు ఉక్రెయిన్‌లోని ఇండియన్ ఎంబసీ కూడా స్పందించింది. ఉక్రెయిన్‌లో మార్షల్ లా అమల్లో వుందని.. ప్రయాణాలు కష్టంగా మారాయని పేర్కొంది. కీవ్‌లో చిక్కుకున్న వారి కోసం స్థానిక యంత్రాంగంతో సంప్రదింపులు జరుపుతున్నామని.. కీవ్‌లో బాంబు వార్నింగ్‌లు, ఎయిర్‌ సైరన్ల మోత వుందని ఇండియన్ ఎంబసీ వెల్లడించింది. అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్‌లో తలదాచుకుంటున్నారని చెప్పింది. పాస్‌పోర్టులతో వీలైనంత వరకు ఇళ్లలోనే వుండాలని.. సైరన్ వినిపిస్తే గూగుల్ మ్యాప్ సాయంతో బాంబ్ షెల్టర్లకు చేరుకోవాలని భారత రాయబార కార్యాలయం తెలిపింది. 

"