ఏపిలోనే జరగబోయే సమావేశాలకు ప్రభుత్వం ఒకటి చెబితే పోలీసులు నాలుగు చేస్తారు. ప్రస్తుతం పోలీసులు రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నారు.

మార్చిలో మొదలవ్వనున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు మొన్నటి రోజు ఘటన ఓ హెచ్చరికమత్రమేనా? అమరావతి ప్రాంతంలోని వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయంలో మొదటిసారిగా ఏపి అసెంబ్లీ సమావేశాలు జరుగబోతున్నాయి. అందునా బడ్జెట్ సమావేశాలతోనే అసెంబ్లీ భవనాలను ప్రారంభిస్తున్నారు. మరి కొత్త అసెంబ్లీలో సమావేశాలు కూడా ఎంత కొత్త తరహాలో జరగాలి? అందుకు ఛాన్సే లేదు. ఎందుకంటే, ప్రతిపక్షంపై అధికారపక్షం అవకాశం ఉన్నచోటల్లా కక్ష తీర్చుకుంటూనే ఉంది.

మొన్నటికిమొన్న రోజా పట్ల పోలీసులు ఎంత హీనంగా వ్యవహరించారో అందరూ చూసిందే. జాతీయ మహిళా సదస్సులో పాల్గొనల్సిందిగా రోజాను ప్రభుత్వమే ఆహ్వానించింది. సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన ఎంఎల్ఏను మళ్ళీ ప్రభుత్వమే అరెస్టు చేయించింది. ఎందుకంటే, సదస్సును భగ్నం చేసేందుకే రోజా విజయవాడకు వచ్చారట. అలాగని పోలీసులకు కలలో కనిపించింది. అందుకే గన్నవరం విమానాశ్రయంలో అరెస్టు చేసిన రోజాను ఏకంగా హైదరాబాద్ లో విడిచిపెట్టారు.

ఈ ఘటన జరిగిన తర్వాత వైసీపీ ఎంఎల్ఏల్లో అసెంబ్లీ సమావేశాల్లో అధికారపక్షం వ్యవహరించే తీరుపై పలు అనుమానాలు మొదలైయ్యాయి. కావాలనే తమను రెచ్చగొట్టి, అరెస్టులు చేయించేందుకు కూడా అధికారపక్షం వెనుకాడరని వైసీపీ నేతలు భావిస్తున్నారు. హైదరాబాద్ లో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో టిడిపి వ్యవహరించిన తీరు అందరికీ తెలిసిందే. హైదరాబాద్ అంటే తెలంగాణా పోలీసులు కూడా ఉంటారు కాబట్టి అందరు పోలీసులూ ఏపి ప్రభుత్వం చెప్పినట్లు వినాల్సిన అవసరం లేదు.

అదే ఏపిలోనే జరగబోయే సమావేశాలకు ప్రభుత్వం ఒకటి చెబితే పోలీసులు నాలుగు చేస్తారు. ప్రస్తుతం పోలీసులు రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నారు. ఈ నేపధ్యంలో అధికర పక్షం రోచ్చగొడుతోందని ప్రతిపక్షం రెచ్చిపోతే అంతే సంగతులు. ఇప్పటికే పలువురు ఎంఎల్ఏలు ప్రివిలేజ్ కమిటి రూపంలో విచారణను ఎదుర్కొన్నారు.