తుని నేషనల్ హైవేపై దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ప్రయాణికుల్లాగా ఆటోలో ఎక్కి డ్రైవర్ ను కత్తులతో పొడిచారు. ఆటోతో పరారై ఓ మహిళను హత్య చేశారు.
కాకినాడ : ఆంధ్ర ప్రదేశ్ లోని కాకినాడ జిల్లా తుని సమీపంలో దారిదోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. నేషనల్ హైవే సమీపంలో ఓ మహిళను హత్య చేశారు. ఓ ఆటో డ్రైవర్ ను తీవ్రంగా గాయపరిచారు. ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కరకలం రేపింది. దీని మీద పోలీసులు, స్థానికులు చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి. దమ్ము దుర్గారావు ఆటో డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
ఆయన అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండలం గుంటపల్లి గ్రామ నివాసి. దుర్గారావు కూతురు అన్నవరంలో ఉంటుంది. ఆమెను చూసేందుకు ఆదివారం సాయంత్రం తన ఆటోలో వెళ్ళాడు. ఆ తర్వాత రాత్రి ఇంటికి తిరుగు ప్రయాణమయ్యాడు. ఆటో డ్రైవర్ కావడంతో ఖాళీగా రావడం ఎందుకులే అని తేటగుంట దగ్గర ఇద్దరిని సవారీ ఎక్కించుకున్నాడు.
ఒంగోలులో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల కలకలం...
రాజుల కొత్తూరు దగ్గరికి వచ్చిన తర్వాత దుర్గారావు వారిద్దరిని డబ్బులు అడిగాడు. కానీ వారు ఇవ్వలేదు. పైగా, తమ దగ్గర ఉన్న కత్తులతో దుర్గారావును పొడిచారు. ఆ తర్వాత ఆటోలో నుంచి కిందికి నెట్టేసి ఆటోతో సహా పరారయ్యారు. ఆటోతో వెళ్లిన ఇద్దరు దుండగులు ఎర్ర కోనేరు దగ్గర రోడ్డు పక్కన కిల్లిబడ్డీ నడుపుతున్న పప్పు సత్యవతి దగ్గరికి వెళ్లారు. ఆమెను బెదిరించి బంగారం, డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తన దగ్గర ఏం లేవని ఆమె చెప్పడంతో ఆమె మీద కూడా కత్తులతో దాడి చేశారు. ఈ హఠాత్పరిణామానికి ఆమె వెంటనే పెద్దగా కేకలు వేయడం ప్రారంభించింది.. ఆ కేకలు విన్న ఆమె పెద్ద కుమార్తె నాగమణి.. చుట్టుపక్కల వారు వచ్చారు. వారిని చూసిన దుండగులు వెంటనే అక్కడి నుంచి పారిపోయారు. అప్పటికే కత్తుల గాయాలతో తీవ్రంగా గాయపడింది సత్యవతి.
స్థానికుల సహాయంతో పెద్ద కూతురు ఆమెని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే సత్యవతి మృతి చెందింది. మరోవైపు రాజుల కొత్తూరు సమీపంలో మొదటగా దాడిలో గాయపడిన దుర్గారావు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలిసిన స్థానిక పోలీసులు ఎస్పి సతీష్ కుమార్ ఘటన స్థలాన్ని పరిశీలించారు.
బాధితులు చెప్పిన వివరాల ప్రకారం నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. నిందితులను పట్టుకోవడం కోసం ఆరు బృందాలను ఏర్పాటు చేసినట్లు ఎస్పీ సతీష్ తెలిపారు.
