గోదావరి జిల్లాలో కొనసాగుతున్న జగన్ పాదయాత్ర

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గోదావరి జిల్లాల్లో కొనసాగుతోంది. ఆయన వెంట వైఎస్ అభిమానులు, పార్టీ కార్యకర్తలు కదం తొక్కి నడుస్తున్నారు. రోడ్డు కమ్‌ రైలు బ్రిడ్జి నీలి రంగులో మెరిసిపోయింది. వైఎస్సార్‌ సీపీ జెండాలతో రెపరెపలాడింది. గోదావరిలో ఏకంగా సుమారు 600 పడవల్లో కార్యకర్తలు పార్టీ జెండాలు ఎగురవేసి.. జగన్‌తోనే మేమంటూ ముందుకు సాగారు. ప్యారాచూట్‌లతో ఆకాశంలోనూ జెండాలు ఆవిష్కరించి అబ్బురపరిచారు.

పశ్చిమగోదావరి జిల్లాలో తన యాత్ర ముగుంచుకొని తూర్పుగోదావరి జిల్లాకు ఆయన పయనమయ్యారు. కాగా.. ఆయనకు వీడ్కోలు ఘనంగా పలికారు. జనం ఆయనతో నడిచేందుకు ఉత్సాహం ప్రదర్శించారు. వేల సంఖ్యలో తరలిరావడంతో కొవ్వూరులోని రోడ్డు కమ్‌ రైలు బ్రిడ్జి ఒక దశలో కంపించింది. 

ఇది గమనించిన పోలీసులు కొంత వ్యవధిని పాటించి కార్యకర్తలను పాదయాత్రకు అనుమతించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా పాదయాత్ర రాజమండ్రి చేరుకుంది. పాదయాత్రలో బొత్స సత్యనారాయణ, జీఎస్‌రావు, వైవీ సుబ్బారెడ్డి, కొవ్వూరు నియోజకవర్గ కన్వీనర్‌ తానేటి వనిత, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, జీఎస్‌ నాయుడు, కారుమూరి నాగేశ్వర రావు, గుణ్ణం నాగ బాబు, కోటగిరి శ్రీధర్‌ తదితరులు పార్టీ అధినేత వెంట పాల్గొన్నారు.