కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుడ్లవల్లేరు మండలం వడ్లమన్నాడు గ్రామం వద్ద 12మంది కూలీలలో ప్రయాణిస్తున్న ఆటో ప్రమాదానికి గురయ్యింది. దీంతో ముగ్గురు అక్కడిక్కడే మృతిచెందగా మరో తొమ్మిదిమంది తీవ్రంగా గాయపడ్డారు. 

కూలీ పనుల కోసం గుడ్లవల్లేరుకు వెళ్లిన కూలీలు తిరిగి సొంత గ్రామానికి తిరిగి వెళుతుండగా ఇలా ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న ఆటో వేగంగా వెళుతూ ముందున్న టిప్పర్ లారీని ఢీకొట్టింది. దీంతో ఆటోలో ముుందు కూర్చున్న జన్ను నాంచారయ్య, జన్ను వెంకన్న, మోటుకురు శివ ప్రమాద స్థలంలోనే మృతిచెందారు. మిగతావారికి తీవ్ర గాయాలయ్యాయి. 

read more   శ్రీశైలం యాత్రలో విషాదం... రోడ్డు ప్రమాదంలో 8మంది దుర్మరణం

ప్రమాదంపై సమాచారంఅందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మొదట గాయపడిన క్షతగాత్రులను మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం మృతదేహాలను కూడా పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

మృతులు, క్షతగాత్రులంతా  పెడన మండలం జింజెరు గ్రామానికి చెందినవారు. తమ గ్రామానికి చెందినవారు రోడ్డు ప్రమాదానికి గురవడంతో జింజెరు గ్రామస్తులు తీవ్ర విషాదాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక మృతులు, క్షతగాత్రుల కుటుంభీకులు  శోకసంద్రంలో మునిగిపోయారు.