నెల్లూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది.  శ్రీశైలం నుంచి నెల్లూరు వైపు ఓ టెంపో వాహనంలో వెళుతున్న తమిళనాడువాసులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో 8మంది  మృత్యువాతపడ్డారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. 

బుచ్చిరెడ్డిపాలెం మండలం దామరమడుగు వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళుతున్న టెంపో ఓ లారీని ఢీకొట్టింది. దీంతో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడి హాస్పిటల్ కు తరలించే క్రమంలో ప్రాణాలు వదిలారు. శ్రీశైలం యాత్ర ముగించుకుని నెల్లూరువైపు వెళ్తున్న యాత్రికులు ఈ ప్రమాదానికి గురయ్యారు. ప్రమాద సమయంలో టెంపోలో మొత్తం 15 మంది యాత్రికులు వుండగా ఐదు మంది మహిళలు, ముగ్గురు పురుషులు మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. 

ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మొదట గాయపడినవారి ని హాస్పిటల్ కు తరలించిన పోలీసులు అనంతరం టెంపోలో ఇరుక్కుపోయిన మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు. అనంతరం ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారు.