భారతీయ జనతా పార్టీ రాయలసీమ నేతల కీలక సమావేశం కర్నూలులో మొదలైంది. గడచిన మూడున్నేళ్ళుగా చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో రాయలసీమ ప్రాంతంలో నిర్లక్ష్యానికి గురైన ఇరిగేషన్ ప్రాజెక్టులు, హౌసింగ్ ప్రాజెక్టులపై చర్చించటానికి నేతలు సమావేశమయ్యారు. అంతేకాకుండా ప్రాజెక్టుల్లో పెరిగిపోయిన అవినీతిపైన కూడా చర్చించనున్నారు.

సంపాదన, వాటాలు, చంద్రబాబు చేసిన పంచాయితీ, ఐఏఎస్ అధికారుల సక్ష్యాలు తదితరాలపై తాజాగా ఫిరాయింపు మంత్రి ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలపైన కూడా చర్చించనున్నారు. స్వయంగా మంత్రే తన అక్రమ సంపాదనపై కార్యకర్తలతో బాహరింగంగా చెప్పటం సంచలనమే రేపుతోంది. మంత్రి వీడియో, ఆడియో టేపులపై అటు టిడిపిలోనే కాకుండా ఇటు బిజెపిలో కూడా పెద్ద చర్చనీయాంశమైంది.

చంద్రబాబు హయాంలో అవినీతి పెరిగిపోయిందని తాము ఎప్పటి నుండో చేస్తున్న ఆరోపణలకు ఫిరాయింపు మంత్రి వీడియో, ఆడియో టేపులను పలువురు నేతలు ఆధారాలుగా చెప్పుకుంటున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సమావేశం సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. ఈ సమావేశంలో రాబోయే ఎన్నికల విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా నేతలు చర్చిస్తారు.