ఏలూరు: తమ పార్టీ నర్సాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణమ రాజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్ కు కొరకరాని కొయ్యగా తయారయ్యారు. వైఎస్ జగన్ ను చిక్కుల్లో పడేయడానికి రఘురామ కృష్ణమ రాజు మరో సంచలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 

రాష్ట్రం పరిధిలో జరిగే అభివృద్ధి, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రికి పెద్ద పీట వేయడం ఆనవాయితీ. ఆయన అందుబాటులో లేకపోతే జిల్లా మంత్రి చేత లేదంటే ఇంచార్జీ మంత్రి చేతుల మీదుగా ఆ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతారు. అయితే, రఘురామ కృష్ణం రాజు తన నియోజకవర్గంలో పరిధిలో నిర్వహించే కార్యక్రమం విషయంలో ముఖ్యమంత్రికి షాక్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు.

Also Read: నలంద కిశోర్ మృతి: వైఎస్ జగన్ మీద విరుచుకుపడిన రఘురామ కృష్ణమ రాజు

తన నర్సాపురం నియోజకవర్గంలో జరిగే వివిధ కార్యక్రమాలకు రఘురామ కృష్ణమ రాజు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను ఆహ్వానించారు. ఆమెకు ఆహ్వానం పంపించారు. నర్సాపూర్ అసెంబ్లీ పరిధిలోని మైనపువాని లంకలో నిర్మలా సీతారామన్ కేటాయించి రూ. 4 కోట్ల నిధులతో భవనాలు నిర్మించారు. ఆ భవనాల ప్రారంభోత్సవానికి ఆయన నిర్మలా సీతారామన్ ను ఆహ్వానించారు. అక్టోబర్ నెలలో ఒక రోజు తన నియోజకవర్గంలో పర్యటించాలని ఆమెను కోరారు. 

అంతేకాకుండా విపత్తు నిర్వహణ నిధుల నుంచి కోతకు గురవుతున్న తీర ప్రాంతంలో రివిట్ మెంట్ పనులకు రూ.200 కోట్లు కేటాయించాలని ఆయన నిర్మలా సీతారామన్ ను కోరారు. గతంలో నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ఆ సమయంలో ఆమె నర్సాపురం నియోజకవర్గంలోని మైనపువాని లంక గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.