న్యూఢిల్లీ: మాజీ మంత్రి, ఎమ్మెల్యే నలంద కిశోర్ మృతిపై వైఎస్సార్ కాంగ్రెసు తిరుగుబాటు పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్మమ రాజు తీవ్రంగా స్పందించారు. నలంద కిశోర్ మృతి పోలీసు హత్య అని ఆయన అన్నారు. నలంద కిశోర్ కుటుంబ సభ్యుల శాపాలు మంచివి కావని ఆయన అన్నారు. నలంద కిశోర్ మరణం చాలా బాధించిందని, ఆయన తనకు మంచి మిత్రుడని, విద్యాసంస్థల అధినేత, మంచి పౌరుడు అని రఘురామ కృష్ణమ రాజు అన్నారు. ఎంపీగా కాకుండా తాను ఓ పౌరుడిగా మాట్లాడుతున్నానని ఆయన అన్నారు. 

సోషల్ మీడియాలో పోస్టు ఫార్వర్డ్ చేశారని నలంద కిశోర్ ను అరెస్టు చేసి కర్నూలు తీసుకుని వెళ్లారని, అక్కడ కోవిడ్ రోగులు ఉండే సెంటర్ లో ఆయనను పెట్టారని, దాంతోనే నలంద కిశోర్ మరణించారని రఘురామ కృష్ణమ రాజు శనివారం మీడియాతో అన్నారు. ఒకదాని వెంట మరొకటి బాధాకరమైన సంఘటనలు జరుగుతున్నాయని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు తెలిసే జరుగుతున్నాయని ఆయన అన్నారు. 

మాట్లాడే హక్కును, జీవించే హక్కును కాలరాస్తున్నారని ఆయన అన్నారు. సంక్షేమ పథకాలు మాత్రమే ప్రభుత్వాన్ని కాపాడలేవని, వాటితో పాటు జీవించే హక్కు, మాట్లాడే హక్కు కూడా ఉండాలని, దయచేసి జగన్ అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను దెబ్బ తీయడం మంచిది కాదని ఆయన అన్నాడు. తమ బాధను, సృహదయంతో అర్థం చేసుకోవాలని ఆయన జగన్ ను కోరారు.  

Also Read: మాజీ మంత్రి గంటా అనుచరుడు మృతి

మాట్లాడే హక్కును హరించినట్లుగానే జీవించే హక్కును కూడా ప్రభుత్వం హరిస్తోందని ఆయన అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోషల్ మీడియాలో మెసేజ్ లపై చర్యలు తీసుకుంటున్నప్పుడు జగన్ వ్యతిరేకించారని, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అలాగే చేయడం సరి కాదని ఆయన అన్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అలాగే చేయడం పరాకాష్ట అని ఆయన అన్నారు. 

పోలీసులు బాధ్యతారహితంగా, నిర్లక్ష్యంగా వ్యవహరించి నలంద కిశోర్ చావుకు కారణమయ్యారని, పోలీసులను ప్రోత్సహిస్తే వారు మరింత రెచ్చిపోతారని, ఈ విషయాన్ని జగన్ గమనించాలని, వారిని అదుపులో పెట్టాలని ఆయన అన్నారు. ఇటీవల మాస్క్ పెట్టుకోలేదని ఓ యువకుడిని కొట్టి చంపారని ఆయన అన్నారు. పోలీసు దమనకాండను ప్రభుత్వాధినేతగా జగన్ నిరసించాలని ఆయన అన్నారు. ఇదే పద్ధతి కొనసాగితే ప్రజలు సహించలేని పరిస్థితి వస్తుందని ఆయన అన్నారు.

చాలా మంది మెసేజ్ లు ఫార్వర్డ్ చేశారని, నలంద కిశోర్ ఎవరా ఆ వ్యక్తి అని ఉత్సుకతతో ఫార్వర్డ్ చేస్తే హింసిస్తారా అని ఆయన అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన జగన్ ను కోరారు. 

నిన్న సుప్రీంకోర్టులో జరిగింది చూశామని, జగన్ ప్రభుత్వం ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కొనసాగిస్తుందనే నమ్మకం లేదని రఘురామ కృష్ణమ రాజు అన్నారు.