చంద్రబాబునాయుడుపై బిజెపి నేత పురంధేశ్వరి ఫుల్లుగా ఫైర్ అయ్యారు. కేంద్రం నుండి సాయం తీసుకుంటూ కూడా అసత్యాలను ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. కేంద్రం నుండి టిడిపి మంత్రులు రాజీనామాలు చేసిన నేపధ్యంలో పురంధేశ్వరి మీడియా సమావేశంలో పలు వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన నిధుల విషయంలో చంద్రబాబు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని పురందేశ్వరి మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు, రాజధాని నిర్మాణానికి, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదోవపట్టించిందని ఆరోపించారు.

విభజన హామీలను కేంద్రం నెరవేర్చలేదంటూ చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నట్లు మండిపడ్డారు. రాష్ట్రంలో అమలవుతున్న చాలా పథకాలు కేంద్రం నిధులతోనే నడుస్తున్నాయన్నది వాస్తవమన్నారు. చంద్రన్న బీమా, నీరు-చెట్టు, 24 గంటల విద్యుత్‌, పేదలకు ఇళ్లు లాంటి పథకాలన్నీ కేంద్రానివే అని గుర్తు చేశారు. కానీ టీడీపీ మాత్రం వాటిని తమవిగా ప్రచారం చేసుకుంటోందని ఎద్దేవా చేశారు.

కేంద్రం ఇచ్చిన నిధులు దారి మళ్ళిన వైనం కూడా రుజువులతో సహా చెప్పారు. రాజధాని నిర్మాణానికి రూ.2,500 కోట్లిస్తే వాటిని దారిమళ్లించారట. పోలవరం ప్రాజెక్టుకు రూ.5వేల కోట్లు, వెనుకబడిన ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు పన్ను రాయితీని కల్పించినట్లు చెప్పారు. దేశం మొత్తానికి 10 లక్షల ఇళ్లు కట్టిస్తే ఒక్క ఏపీలోనే 6 లక్షల ఇళ్లు కట్టామన్నారు. బహుశా ఇళ్ళ మంజూరు చేశామని చెప్పటం పురంధేశ్వరి ఉద్దేశ్యం కాబోలు. ఏపీపై కేంద్రం శ్రద్ధ తీసుకుంటుందనడానికి ఇంతకంటే వేరే నిదర్శనం కావాలా?’అని పురందేశ్వరి నిలదీశారు.