అధర్మంగా అధికారం దక్కినా స్వీకరించను: నాసిన్ ప్రారంభోత్సవ సభలో మోడీ సంచలనం
నాసిన్ కేంద్రం ప్రారంభించిన తర్వాత నిర్వహించిన సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు.
అమరావతి:అధర్మంగా తనకు అధికారం దక్కినా తాను స్వీకరించనని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు.
ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీసత్యసాయి జిల్లాలోని గోరంట్ల మండలం పాలసముద్రంలో నాసిన్ కేంద్రాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మంగళవారంనాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మోడీ ప్రసంగించారు. అక్రమంగా దక్కే అధికారాన్ని స్వీకరించొద్దని రాముడు చెప్పారని మోడీ గుర్తు చేశారు.
నాసిన్ ప్రముఖ శిక్షణ సంస్థగా మారుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు.సుపరిపాలనకు సరికొత్త కేంద్రంగా నాసిన్ మారనుందని మోడీ అభిప్రాయపడ్డారు.వెనుకబడిన సత్యసాయి జిల్లాలో నాసిన్ ను ఏర్పాటు చేసినట్టుగా మోడీ చెప్పారు.
సత్యసాయిబాబా స్వస్థలం పుట్టపర్తి కూడ ఈ జిల్లాలోనే ఉందని మోడీ గుర్తు చేశారు. ఇవాళ ఉదయం లేపాక్షి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. గాంధీజీ అనేకసార్లు రామరాజ్యం గురించి ప్రస్తావించారన్నారు.రామరాజ్యంలో అందినట్లుగా ప్రజలకు సుపరిపాలన అందాలని గాంధీజీ చెప్పారని మోడీ ప్రస్తావించారు.సుపరిపాలన అంటే బలహీనులకు అండగా ఉండడమేనని ప్రధాని చెప్పారు.
దేశంలో ఆదునిక ఎకో సిస్టంగా నాసిన్ మారనుందని ప్రధాన మంత్రి మోడీ అభిప్రాయపడ్డారు. కస్టమ్స్, పన్నులు, నార్కోటిక్స్ లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గా నాసిన్ మారుతుందన్నారు. రామరాజ్యంలో పన్నుల వ్యవస్థ ఎంతో సరళంగా ఉండేదన్నారు. మన పన్నుల వ్యవస్థ కూడ సరళంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
భూమి నీటిని గ్రహించి ఆవిరై తిరిగి వర్షంగా కురిసినట్టుగా పన్నులుండాలన్నారు. జీఎస్‌టీ రూపంలో ఆధునిక పన్నుల వ్యవస్థ తెచ్చినట్టుగా మోడీ చెప్పారు.ఆదాయపన్ను చెల్లింపు విధానం కూడ సులభతరం చేశామన్నారు.
ప్రతి ఏటా రికార్డు స్థాయిలో పన్నులు వసూలు అవుతున్నాయని మోడీ గుర్తు చేశారు.తమ ప్రభుత్వం ఆదాయపన్ను పరిమితిని పెంచిన విషయాన్ని మోడీ ప్రస్తావించారు. ప్రతి ఏటా ఆదాయపన్ను చెల్లించే వారి సంఖ్య కూడ పెరుగుతుందని మోడీ చెప్పారు. వచ్చే పన్నులతో దేశంలో మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
పేదలు, రైతులు, మహిళలు, యువకుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మోడీ హామీ ఇచ్చారు.10 ఏళ్లుగా అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్నామని మోడీ తెలిపారు.తమ ప్రభుత్వం చేపట్టిన పథకాలు కాగితాలపై కాదు...క్షేత్రస్థాయిలో అమలౌతున్నాయని మోడీ వివరించారు.
also read:ఏపీలోని పాలసముద్రంలో నాసిన్ కేంద్రం ప్రారంభించిన మోడీ
తొమ్మిదేళ్లలో 25 కోట్ల మందిని పేదరికం నుండి బయటకు తెచ్చినట్టుగా మోడీ గుర్తు చేశారు. పేదల జీవితాలు బాగుపడ్డాయనే విషయం నీతి ఆయోగ్ చెప్పిందన్నారు. వివిధ ఉపాధి అవకాశాల ద్వారా పేదల జీవితాల్లో వెలుగులు తెచ్చామన్నారు.