గరికపాటి నరసింహారావు... టివిలు చూసే తెలుగు వాళ్ళకు ప్రత్యేకించి పరిచటం అవసరం లేని పేరు. గరికపాటి ప్రతీ రోజు చెప్పే ప్రవచనాలు వినని తెలుగు వాళ్ళుండరేమో. అటువంటి గరికపాటి ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తయిపోయారు. ఇంతకూ ఆయన వార్తల్లో వ్యక్తిగా ఎందుకయ్యారు? అంటే, తెలుగు మహాసభల్లో పాల్గొనటాన్ని ఆయన తిరస్కరించారు కాబట్టి.

ఇంతకీ విషయం ఏమిటంటే, తెలంగాణా ప్రభుత్వం ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. శుక్రవారం సభలు బ్రహ్మాండంగా ప్రారంభమయ్యాయి. అటువంటి మహాసభల్లో పాల్గొనేందుకు ప్రముఖ సాహితీవేత్త, సహస్రవధాని గరికపాటి తిరస్కరించారు. ఈ విషయం ఇపుడు సంచలనంగా మారింది. సాటి తెలుగు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ఆహ్వానించకపోవటంతో తాను ఆవేధనకు గురైనట్లు చెప్పారు. అందుకే తాను కూడా సభలకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు.

గరికపాటి మీడియాతో మాట్లాడుతూ, 5 కోట్లమంది కుటుంబసభ్యులకు పెద్ద అయిన ముఖ్యమంత్రిని పిలవకపోవటం దారుణమన్నారు. ‘మహాసభలకు హాజరవుదామనే తొలుత అనుకున్నా’ని చెప్పారు. అయితే, ‘ఇపుడు జరుగుతున్నది తెలంగాణా మహాసభలు కావని, తెలుగు మహాసభలన్న విషయం అందరూ గుర్తుంచుకోవాల’న్నారు. తాను పుట్టి పెరిగిన ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రినే పిలవనపుడు తాను వెళ్ళటంలో అర్ధం లేదనింపించిందన్నారు. ‘ఎవరైనా పెళ్ళికి పిలిచినపుడు ముందు యజమానిని పిలిచిన తర్వాతే మిగిలిన వాళ్ళని పిలుస్తారు’ అంటూ గుర్తు చేసారు.