మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించినా ఏమాత్రం ప్రోత్సాహకంగా లేకపోవటంతో ప్రభుత్వంలో నిరుత్సాహం కనబడుతోంది.

మొదటి ప్రయత్నానికే స్పందన కరువైంది. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలకు సంబంధించి ముందస్తు సన్నాహకాలను ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వెలగపూడిలో ప్రారంభించారు. అయితే, ప్రభుత్వం అనుకున్నది ఒకటైతే జరిగింది మరొకటి. బడ్జెట్ కు సంబంధించిన సూచనలు, సలహాలు ఇస్తారని వివిధ రంగాల్లోని నిపుణులను యనమల ఆహ్వానించారు. ఆహ్వనాలందకున్న వారు వచ్చారు కానీ సమయం వృధా తప్ప ఉపయోగం కనబడలేదు.

మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించినా ఏమాత్రం ప్రోత్సాహకంగా లేకపోవటంతో ప్రభుత్వంలో నిరుత్సాహం కనబడుతోంది. సమావేశాలకు హాజరైన నిపుణులు, ఉన్నతాధికారులు కూడా తమ సమస్యలను వివరించారే గానీ పరిష్కారాలు, సలహాలు ఇవ్వలేకపోయారు. దాంతో అసలు సమావేశాలు ఎందుకు నిర్వహించామా అంటూ యనమల తల పట్టుకున్నారు.

ప్రోత్సాహకాలు కావాలంటూ, స్ధలాలు కావాలంటూ పారిశ్రామికవేత్తలు, ఉత్పత్తులకు మద్దతు ధర ఇవ్వాలని రైతులు, వివిధ పథకాల అమలుకు నిధుల సమస్య తలెత్తుతోందని ఉన్నతాధికారులు తమ సమస్యలనే ఏకరవుపెట్టారు. పారిశ్రామిక వర్గాలు లేవనెత్తుతున్న సమస్యల పరిష్కారానికి వెంటనే ఓ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని యనమల ఉన్నతాధికారులను ఆదేశించారు.

అదే సమావేశంలో పాల్గొన్న మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి మట్లాడుతూ తమ సంస్ధకు నిధులు విడుదల కావటం లేదని ఫిర్యాదు చేయటం గమనార్హం. జీతాలు కూడా చెల్లించలేని పరిస్ధితుల్లో తమ సంస్ధ ఉందని రాజకుమారి వాపోయారు.