Modi Amaravati Tour:  ఏపీ రాజధాని అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన పూర్తి షెడ్యూల్‌ వచ్చేసింది. ప్రధాని మోదీ మే 2న అమరావతికి రానున్నారు. ఇక సభకు సంబంధించి, మోదీ పర్యటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

ప్రధాని మోదీ మే 2న మధ్యాహ్నం 3 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్ లో మధ్యాహ్నం 3.30 గంటలకు అమరావతిలోని హెలిప్యాడ్‌ వద్ద దిగనున్నారు. అక్కడి నుంచి ప్రధాన వేదిక వరకు 1.1 కి.మీ. మేర రోడ్డు షోలో పాల్గొంటారు. 15 నిమిషాలపాటు రోడ్డు షో ఉండనుంది. 

ఇక 3.45 గంటల నుంచి 4 గంటల వరకు అమరావతి పెవిలియన్‌ను సందర్శించనున్నారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు సభ జరుగుతుంది. తొలుత అమరావతి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం ప్రధాని మోదీ సభలో ప్రసంగిస్తారు.

సభ ముగిసిన అనంతరం 5.10 గంటలకు హెలికాప్టర్‌లో బయల్దేరి గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లనున్నారు. 

ప్రధాన వేదికపై 20 మంది.. 
ప్రధాని సభ కోసం మూడు వేదికలు సిద్ధం చేస్తున్నారు. ప్రధాన వేదికపై ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా మొత్తం 20 మంది ముఖ్య నేతలు కూర్చోనున్నారు. మిగిలిన మంత్రులు, నేతలు, వీవీఐపీల కోసం మరో వేదిక ఏర్పాటు చేశారు. దానిపై సుమారు 100 మంది కూర్చోవచ్చు. ఇక మూడో వేదికపై అమరావతికి భూములు ఇచ్చిన రైతులు కూర్చోనున్నారు. 

అమరావతికి ప్రధాని మోదీ వస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేస్తోంది. బహిరంగ సభ కోసం ఏపీ సెక్రటేరియట్‌ సమీపంలో సుమారు 250 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు చేస్తున్నారు. మరో 100 ఎకరాల వరకు పార్కింగ్‌కు కేటాయిస్తున్నారు. ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా సభకు ప్రజలు చేరుకునేందుకు మొత్తం 7 మార్గాలను ఏర్పాటు చేశారు. ఈ మార్గాల నుంచి ప్రజలు రావాలని, పోలీసులు, అధికారులు అందుకు సహకరించాలని మంత్రుల కమిటీ సూచించింది.