‘ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు కార్యక్రమానికైనా చంద్రబాబునాయుడును ఆహ్వానించాలి’ ...ఇది టిడిపి నేతలు తాజాగా చేస్తున్న డిమాండ్. డిమాండ్ అందామా లేక తెలంగాణా బ్రతిమలాడుకుంటున్నారు అనుకుందామా ? బ్రతిమలాడుకుంటున్నట్లే చెప్పుకోవాలేమో? ఎందుకంటే, టిడిపి నేతల మాటలు అలానే ఉంటున్నాయి. హైదరాబాద్ లో కావచ్చు ఇంకెక్కడైనా కావచ్చు మొత్తం మీద తెలంగాణాలో జరుగుతున్న ఏ కార్యక్రమానికి కూడా చంద్రబాబుకు తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆహ్వానం పంపదలుచుకోలేదన్నది వాస్తవం. మొన్ననే జరిగిన మెట్రో ఇనాగరేషన్ కావచ్చు లేదా గ్లోబల్ ఎంటర్ ప్రెన్యూర్ సమ్మిట్ కావచ్చు. అందులో భాగమే తాజాగా మొదలైన తెలుగు మహాసభల విషయం కూడా.

చంద్రబాబును పిలిస్తే బాగుంటుందనుకోవటంలో తప్పేమీ లేదు. నిజానికి హైదరాబాద్ 10 ఏళ్ళ పాటు ఉమ్మడి రాజధాని కూడా. హైదరాబాద్ పరిధిలో ఏ కార్యక్రమం జరిగినా ప్రోటోకాల్ ప్రకారం చంద్రబాబును కూడా పిలవాలి. కానీ ఉమ్మడి చట్టాన్ని, ప్రోటోకాల్ ను సైతం కెసిఆర్ భేఖాతరు చేస్తున్నారంటే అందుకు చంద్రబాబు స్వయంకృతమే కారణమని చెప్పకతప్పదు.

ఇక ప్రస్తుత విషయానికి వస్తే టిడిపి సీనియర్ నేత, ఎంఎల్సీ గాలి ముద్దు కృష్ణమనాయుడు మీడియాతో మాట్లాడుతూ, తెలుగు మహాసభల ప్రారంభోత్సవానికి చంద్రబాబును పిలవకపోవటం ఏమీ బావోలేదన్నారు. కనీసం ముగింపు కార్యక్రమానికైనా పిలవాలంటూ కెసిఆర్ ను బ్రతిమలాడుకున్నట్లు మాట్లాడారు. శనివారం ఉదయం జరిగిన టివి చర్చల్లో కూడా పాల్గొన్న టిడిపి నేతలు గాలి తరహాలోనే మాట్లాడారు. చంద్రబాబును మహాసభల ముగింపు కార్యక్రమానికైనా పిలవాల్సిందే అంటూ సూచించటం గమనార్హం. మొత్తానికి 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబుకు ఎంతటి దురవస్త వచ్చిందో కదా?