జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యక్తిత్వం విచిత్రంగా ఉంది. ఎవరి గురించి ఏమి మాట్లాడుతున్నారో అర్ధం కావటం లేదు. కనీసం తాను పర్యటించబోయే జిల్లాల గురించి కనీస సమాచారం కూడా ఉన్నట్లు లేదు. తాజాగా పవన్ చేసిన వ్యాఖ్యను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఈనెల 28వ తేదీ నుండి అనంతపురం జిల్లాలో పర్యటిస్తానని చెప్పారు. అంతవరకూ బాగానే ఉంది. తర్వాత చెప్పిన విషయంపైనే అందరూ ఆశ్చర్యపోతున్నారు.

ఇంతకీ పవన్ చెప్పిందేమిటంటే, అనంతపురం జిల్లాలోని కరువు పరిస్ధితులపై పోరాటం చేస్తారట. అనంతపురం జిల్లా అంటేనే కరువు గుర్తుకు వచ్చేమాట చరిత్ర. ఇపుడు అంత కరువు లేదు. పైగా ప్రస్తుతం జిల్లాలో కరువు బాగా తగ్గినట్లే ఉంది. ప్రాజెక్టులు, కుంటలు నీటితో బాగున్నాయి. అందుకే వ్యవసాయం, పూలు, పండ్ల సాగు జోరుగా సాగుతోంది.

ఇటువంటి పరిస్ధితుల్లో జిల్లాలో కరువు గురించి పవన్ మాట్లాడటమంటే ఆశ్చర్యంగా ఉంది. అంటే ఒక జిల్లాలో పర్యటించాలని అనుకున్నపుడు కనీసం జిల్లాలో ప్రస్తుత పరిస్ధితుల గురించి కూడా  సమాచారం తెప్పించుకోవటం లేదన్న విషయం అర్ధమైపోతోంది.

పైగా వచ్చే ఎన్నికల్లో అనంతపురం జిల్లా నుండే పోటీ చేస్తానని గతంలోనే ప్రకటించారు. అటువంటపుడు జిల్లా గురించిన సమాచారం విషయంలో ఇంకెంత అప్ డేట్ లో ఉండాలి? అయితే, ఇవేవీ పవన్ కు పట్టినట్లు లేవు. ఏదో నాలుగు మాటలు మాట్లాడేయటం, నలుగురిపై ధ్వజమెత్తటం తర్వాత మాయమైపోవటం. పవన్ తంతు ఇదే విధంగా సాగుతోంది. ఇంకెంత కాలం ఈ విధమైన రాజకీయాలు చేస్తారో చూడాలి?