మోదీజీ.... ఆ పని చేయ్యొద్దు

Pawan writes to PM against privitization of Dredging corporation
Highlights

  • విశాఖపట్నంలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డిసిఐ)ను ప్రైవేటీకరించటాన్ని వ్యతిరేకిస్తూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రధానమంత్రి నరేంద్రమోడికి లేఖ రాసారు.

విశాఖపట్నంలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డిసిఐ)ను ప్రైవేటీకరించటాన్ని వ్యతిరేకిస్తూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రధానమంత్రి నరేంద్రమోడికి లేఖ రాసారు. డిసిఐని ప్రైవేటీకరించేందుకు కేంద్రప్రభుత్వం రంగం సిద్దం చేసింది. అందుకు నిరసనగా వెంకటేశ్ అనే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ విషయమై మాట్లాడేందుకు పవన్ బుధవారం విశాఖలో పర్యటించారు. వెంకటేష్ కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత ఉద్యోగులను ఉద్దేశించి పవన్ మాట్లాడుతూ, డిసిఐని ప్రైవేటికరించటాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ఉద్యోగులు చేస్తున్న ఆందోళనకు తన మద్దతు ప్రకటించారు.

పోయిన ఎన్నికలైన దగ్గర నుండి ఇప్పటి వరకూ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రిని కలిసి తనకు వ్యక్తిగతంగా అది కావాలి, ఇది కావాలంటూ ఎప్పుడూ కలవలేదన్నారు. ప్రధానిని కలవటానికి తాను కనీసం ప్రయత్నం కూడా చేయలేదన్నారు. వ్యక్తిగత సమస్యలకన్నా ప్రజా సమస్యల పరిష్కారంపైనే తాను ఎక్కువ దృష్టి పెట్టినట్లు చెప్పారు. కాంగ్రెస్, టిడిపి, భాజపా నేతల్లాగ తాను ప్రధాని, ముఖ్యమంత్రిని కలిసి ఫొటోలు దిగి, కాఫీలు తాగేసి వెళ్ళిపోయే వాడిని కాదని అధికార పార్టీ నేతలకు చురకలంటించారు.

అయితే, మొదటిసారిగా డిసిఐ సమస్య పరిష్కారానికి ప్రధానమంత్రికి లేఖ రాసినట్లు చెప్పారు. లాభాల్లో ఉన్న డిసిఐని  ప్రైవేటీకరించటాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. నష్టాల్లో ఉన్న సంస్ధలను ప్రైవేటీకరించారన్నా  అర్ధముందన్నారు. ప్రభుత్వ రంగ సంస్ధల నుండే డిసిఐ కోట్లాది రూపాయల బకాయిలు రావాల్సుందన్నారు. కొన్ని వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్న సంస్ధను కేంద్రం ఎందుకు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని అనుకుంటోందో తనకు అర్ధం కావటం లేదన్నారు. డిసిఐ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రధానమంత్రికి రాసిన లేఖను కూడా పవన్ మీడియాకు చూపారు.

loader