అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పు చోటు చేసుకోబోతున్నాయా..? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సీఎం జగన్ ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు..?పవన్ కళ్యాణ్ వ్యూహం వెనుక ఆంతరంగం ఏంటి....ఢిల్లీ వెళ్లొచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచడం వెనుక కారణం ఏంటి....? 

ఒకప్పుడు బీజేపీని విమర్శించిన పవన్ కళ్యాణ్ తాజాగా అమిత్ షా, మోదీలను పొగడటం వెనుక ఆంతర్యం ఏంటి....? పవన్ ను నడిపిస్తోంది ఢిల్లీ నేతలా...ఢిల్లీ డైరెక్షన్లో పవన్ నడుస్తున్నారా...? బీజేపీలో జనసేన విలీనం అంటున్న వైసీపీ నేతలు వ్యాఖ్యల్లో ఉద్దేశం ఏంటి...? 

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా దూకుడు పెంచారు. రాష్ట్ర రాజకీయాల్లో తన మార్క్ కనిపించేలా పవన్ వ్యవహరిస్తున్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. 

జగన్! చేతకాకపోతే గద్దె దిగు, ఎన్నికల్లో తేల్చుకుందాం: పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతున్నారు. జగన్ మతం, కులంపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. 

వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే పవన్ కళ్యాణ్ తన రాజకీయ వ్యూహానికి పదును పెట్టారు. రాజధాని భూములు, ఇసుక కొరత అంశంపై ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు జనసేనాని. 

అనంతరం ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీలో రెండు రోజులపాటు పర్యటించిన పవన్ కళ్యాణ్ ఎవరిని కలిశారో కూడా తెలియకుండా జాగ్రత్తపడ్డారు. అంతకు ముందు కేంద్రపెద్దలతో తనకు సంబంధాలు ఉన్నాయంటూ కూడా లీకులు ఇచ్చారు జనసేనాని. 

ఢిల్లీ పర్యటన అనంతరం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన విమర్శలకు పదునుపెట్టారు. నేరుగా జగన్ ను టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జగన్  చేసిన విమర్శలకు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. 

మొండోడు, జగన్ కులానికే మానవత్వమా: పవన్

జగన్ ను టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేస్తుండటమే కాదు ఆయనను ముఖ్యమంత్రిగా తాను అంగీకరించబోనని తెగేసి చెప్తున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కూడా చేయని విమర్శలు చేస్తూ ఏపీలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్. 

అయితే పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత నుంచి జగన్ పైనా, ప్రభుత్వంపైనా విరుచుకుపడుతున్నారు. దాంతో పవన్ కళ్యాణ్ టూర్ పై మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఢిల్లీ ఆదేశాలతోనే పవన్ కళ్యాణ్ నడుస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. 

ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఏకంగా హచ్ డాక్ అని పవన్ కళ్యాణ్ ను విమర్శించినా స్పందించడం లేదు. అటు వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి సైతం ఘాటు విమర్శలే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సెల్ ఫోన్ కి పవర్ బ్యాంక్ లాంటోడు అంటూ ఘాటుగా విమర్శించినా చలించడం లేదు పవన్. జగన్ టార్గెట్ గా రెచ్చిపోతున్నారు.

తాజాగా తిరుపతి టూర్ లో ఉన్న పవన్ కళ్యాణ్ బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షాపై ప్రశంసలు కురిపించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అమిత్ షా లాంటి వ్యక్తులు దేశానికి సరైన వారని చెప్పుకొచ్చారు. 

అమిత్ షాయే కరెక్ట్, ఉక్కుపాదంతో తొక్కేస్తారు: బీజేపీపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు

అమిత్ షా ఉక్కుపాదంతో మనుషులతో మాట్లాడతారని అందువల్లే ఆయన లాంటి వారు అవసరమన్నారు. మెత్తగా మాట్లాడితే మనుషులు వినరని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అందువల్లే తాను మెత్తగా మాట్లాడుదలచుకోలేదని కఠినంగానే మాట్లాడతానని చెప్పుకొచ్చారు. 

దాంతో నిన్న మెున్నటి వరకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు అంటూ ఆరోపించిన వైసీపీ నేతలు తాజాగా రూట్ మార్చారు. బీజేపీ ఆదేశాలతోనే పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నారంటూ ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు.  

అయితే పవన్ కళ్యాణ్ తన మాటల తూటాలతో వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే పవన్ వెనుక ఎవరు ఉన్నారు అన్నదే సస్పెన్షన్ గా మారింది. ఢిల్లీ టూర్ లో పవన్ కళ్యాణ్ అమిత్ షాను కలిశారా అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఏపీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని. 

జనసేనను బిజెపిలో విలీనం చేయాలన్నదే పవన్ ప్లాన్: కొడాలి నాని

పవన్ కళ్యాణ్ సినిమాల్లోనూ నటుడే, రాజకీయాల్లోనూ నటుడేనంటూ మంత్రలు సంచలన ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ త్వరలోనే తన పార్టీని బీజేపీలో విలీనం చేస్తారంటూ కొత్త వాదాన్ని తెరపైకి తీసుకువచ్చారు. అయితే పవన్ కళ్యాణ్ ఢిల్లీ డైరెక్షన్లో పయనిస్తున్నారంటూ వైసీపీ ఆరోపిస్తోంది. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్ కేంద్రంగా ఏపీ రాజకీయాలు హీటెక్కాయనడంలో ఎలాంటి సందేహం లేదు.