నంద్యాల ఉపఎన్నికలో టిడిపికి పెద్ద షాకే తగిలింది. ఎన్నికల్లో తటస్తంగా ఉండాలని సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీసుకున్న నిర్ణయంతో టిడిపి అయోమయంలో పడిపోయింది. తమ పార్టీ ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నందున ప్రస్తుతం ఎవరికీ మద్దతిచ్చే స్ధితిలో లేమన్నారు. పార్టీ నిర్మాణం పూర్తయ్యాకే ఎన్నికల్లో పోటీ చేస్తామని పవన్ స్పష్టం చేసారు. 2019 వరకూ ఎన్నికలకు జనసేన దూరంగానే ఉంటుందని కూడా తెలిపారు. పైగా ‘నంద్యాల ఉపఎన్నికే కదా’ అంటూ చాలా లైట్ గా తీసుకున్నారు.

నంద్యాల ఉపఎన్నికలో పవన్ వచ్చి టిడిపి తరపున ప్రచారం చేస్తారంటూ టిడిపి నేతలు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే, నియోజకవర్గంలో బలిజల (కాపు) ఓట్లు సుమారు 26వేలుంది. అంటే అభ్యర్ధి గెలుపోటముల్లో బలిజ సామాజికవర్గం ఓటర్లు నిర్ణయాత్మక స్ధితిలో ఉన్నారు. ఒకవైపేమో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కాపులందరూ నంద్యాల, కాకినాడలో టిడిపికి వ్యతిరేకంగా ఓట్లు వేయాలంటూ పిలుపిచ్చారు. అందుకే ముద్రగడకు విరుగుడుగా పవన్ను రంగంలోకి దింపాలని టిడిపి అనుకున్నది.

అయితే, హటాత్తుగా పవన్ తన నిర్ణయాన్ని ప్రకటించటంతో టిడిపికి కొంత ఇబ్బందులు తప్పకపోవచ్చు. నంద్యాల ఎన్నికలో తాము తటస్తంగా ఉంటామని ప్రకటించటానికి పవన్ కు మూడు వారాలు పట్టటమే విచిత్రం. ఎందుకంటే, పోయిన నెల 29వ తేదీన శ్రీకాకుళం జిల్లాలోని ఉధ్ధానం కిడ్నీ సమస్యపై మాట్లాడేందుకు చంద్రబాబునాయుడును కలిసారు. అదే సమయంలో నంద్యాలలో టిడిపికి మద్దతుపై మీడియాతో మట్లాడుతూ తన నిర్ణయాన్ని మూడు రోజుల్లో చెబుతానని పవన్ చెప్పటం అందరికీ తెలిసిందే.  

నిజానికి జనసేన నిర్మాణానికి, టిడిపికి మద్దతుగా ప్రచారం చేయటానికి ఏమీ సంబంధం లేదు. మిత్రపక్ష హోదాలోనే ప్రచారం చేయవచ్చు. అయినా ప్రచారానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారంటే పవన్లో ఇంకేదో ఆలోచన ఉన్నట్లే అనిపిస్తోంది. ఒకవేళ తాను ప్రచారం చేసినా వైసీపీ గెలిస్తే టిడిపితో పాటు పవన్ పరువు కూడా బజారుపాలవటం ఖాయం. అప్పుడు పవన్ సామర్ధ్యంపై జనాల్లో అనుమానాలు వ్యక్తమవుతుంది.

కాపు రిజర్వేషన్ల కోసం ముద్రగడ ఉద్యమాలు ఇంకోవైపు జరుగుతుండగానే ఇంకోవైపు ఉధ్ధానం కిడ్నీ సమస్య పేరుతో తరచూ పవన్-చంద్రబాబుల భేటీ కాపు సామాజికవర్గంలోనే పవన్ వైఖరిపై తీవ్ర అసంతృప్తి పెరుగుతోంది. ఈ నేపధ్యంలో తాను గనుక టిడిపికి మద్దతుగా ప్రచారంలోకి దిగితే మరింత డ్యామేజి జరగటం ఖాయమని పవన్ గ్రహించినట్లున్నారు. అందుకే నంద్యాలకు దూరంగా ఉండాలని నిర్ణయించారు.