వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో 175 స్ధానాలకు పోటీ చేయనున్నట్లు జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. తమ బలమెంతో అంత వరకే పోటీ చేస్తానని చెప్పటం గమనార్హం. ఈ మేరకు సోమవారం ట్వీట్ చేసారు.
వచ్చే ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో 175 స్ధానాలకు పోటీ చేయనున్నట్లు జనసేన అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. తమ బలమెంతో అంత వరకే పోటీ చేస్తానని చెప్పటం గమనార్హం. ఈ మేరకు సోమవారం ట్వీట్ చేసారు. మొన్నటి వరకూ ఏపిలో మాత్రం పోటీ చేస్తానన్నట్లుగా మాట్లాడేవారు. తాజా ట్వీట్లో మాత్రం తెలంగాణాలో కూడా పోటీ చేస్తానని చెప్పటం గమనార్హం. అంటే మొత్తం 294 స్ధానాలకు గాను జనసేన పోటీ చేసేది కవలం 175 సీట్లు మాత్రమే అన్న విషయంలో స్పష్టత ఇచ్చారు.
మళ్ళీ పోటీ చేసే 175 స్ధానాల్లో కూడా ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లలో పోటీ చేస్తారన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు. తమ బలమెంతో అంత వరకే పోటీ చేస్తానని చెప్పటం కొసమెరుపు. పార్టీ సభ్యత్వం చేయకుండానే, జనాల్లో తిరుగకుండానే తమ బలం 175 సీట్లకే పరిమితమని పవన్ ఎలా నిర్ధారణకు వచ్చారో ఎవరికీ అర్ధం కావటం లేదు. 175 సీట్లలో పోటీ చేయటమంటే, తమ బలం తక్కువనో లేక ఎక్కువనో కూడా పవన్ స్పష్టత ఇవ్వలేదు. 175 సీట్లన్న సంఖ్యను ఎలా నిర్ణయించారు?
ఇదిలావుండగా, ఇంతకాలం వచ్చే ఎన్నికల్లో కూడా భాజపా, జనసేనతో కలిసే పోటీ చేస్తామంటూ ఆమధ్య నారా లోకేష్ చేసిన ప్రకటన గుర్తుండే ఉంటుంది. ఇపుడా ప్రకటనపైనే రాష్ట్ర రాజకీయాల్లో చర్చ మొదలైంది. జనసేన, భాజపాలతో పొత్తులుండే పక్షంలో టిడిపి ఎన్ని స్ధానాల్లో పోటీ చేస్తుంది? ఎందుకంటే, పవన్ తాజా ప్రకటన ప్రకారమే చూసినా తెలంగాణాలో 75 సీట్లు, ఏపిలో 100 సీట్లలో పోటీ చేస్తారనుకుందాం. మరి పొత్తున్న పక్షంలో టిడిపి ఎన్నిసీట్లకు పోటీ చేయాలి? భాజపాకు ఎన్ని సీట్లు కేటాయించాలి? జనసేనకు, భాజపాకు సీట్లు కేటాయిస్తే 175 సీట్లలో మిగిలేవెన్ని ? టిడిపి పోటీ చేసేవెన్ని? అంతా గందరగోళంగా లేదూ?
పవన్ తాజా ప్రకటన చూస్తుంటే బహుశా వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోటీకే జనసేన నిర్ణయించుకున్నట్లు కనబడుతోంది. ఎందుకంటే, గతంలో కూడా జనసేన ఒంటిరిగానే పోటీ చేస్తుందని పవన్ ప్రకటించారు. కాకపోతే, అప్పటి నుండి ఇప్పటి వరకూ చంద్రబాబునాయుడుతో నెరుపుతున్న సన్నిహితం కారణంగానే పవన్ పొత్తులపై అందరిలోనూ అనుమానాలు కలుగుతున్నాయ్. మరి కొద్ది రోజుల్లో పొత్తుల విషయమై పవన్ నుండి మరింత క్లారిటీ వస్తుందేమో చూద్దాం?
