చెన్నై: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తాను ఖచ్చితంగా సీఎం అవుతానని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. చెన్నై పర్యటనలో భాగంగా కమల్ హాసన్ ను కలిసిన పవన్ కళ్యాణ్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. తాను సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తాను వారి కోరిక మేరకు సీఎం అవుతానని తెలిపారు. సీఎం అవ్వడం దక్షిణ భారతదేశంలో తాను కీలకపాత్ర పోషించడం కూడా వాస్తవమన్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ విభజిస్తే న్యాయం చెయ్యాల్సిన బీజేపీ హ్యాండిచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్, బీజేపీలు న్యాయం చెయ్యలేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయం, విభజన హామీల అమలు వంటి అంశాలపై తాను కమల్ హాసన్ తో చర్చించినట్లు తెలిపారు. 2003లో తాను ఎన్నికల బరిలోకి రావాలని ఆశించానని అందుకు బీజం కామన్ మేన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అందులో భాగమేనన్నారు. ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో చేరానని ఆ పార్టీకోసం ప్రచారం చేశానని తెలిపారు. 

2014 ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం పార్టీలకు మద్దతు ప్రకటించినట్లు తెలిపారు. తన మద్దతుతో చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారని చెప్పుకొచ్చారు. 2014 ఎన్నికల తర్వాత ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఎంతో సాయం చేస్తుందని చూశానని కానీ చెయ్యలేదని విమర్శించారు.  

ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబుపై పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు గొప్ప రాజకీయ వేత్త అని కితాబిస్తూనే విమర్శలు కురిపించారు. చంద్రబాబు వ్యవహార శైలిని తాను ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నట్లు తెలిపారు. 

చంద్రబాబు ఎప్పుడు సన్నిహితంగా ఉంటారో ఎప్పుడు ప్రత్యర్థిగా మారతారో అన్నది చెప్పడం కష్టమంటూ విమర్శించారు. చంద్రబాబుతో ప్రయాణం ప్రమాదకరమన్నారు. ఆయనకు అవకాశం ఉన్నప్పుడు పొత్తులు మార్చేస్తుంటారని తెలిపారు. 

గతంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటారని ఆయన ఎప్పుడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారో తెలియదన్నారు.  2014 ఎన్నికల్లో తాను టీడీపీ నుంచి ఎలాంటి పదవులు ఆశించకుండా  కేవలం రాష్ట్ర ప్రయోజనాలను మాత్రమే ఆశించానని తెలిపారు. 

తాను ఆశించింది ఏమాత్రం జరగలేదంటూ పవన్ ఆరోపించారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో ప్రాంతీయ పార్టీల హవా పెరగాలన్నారు. ప్రస్తుతం రాజకీయాల్లో నార్త్ ఇండియా పెత్తనం పెరిగిందన్నారు. త్వరలోనే దక్షిణ భారత దేశం నుంచి ఉద్యమం రాబోతుందన్నారు. ఈ నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో మూడో కూటమి అవసరమని పవన్ స్పష్టం చేశారు. 
 

ఈ వార్తలు కూడా చదవండి

తమిళంలో స్పీచ్ అదరగొట్టిన పవన్