Asianet News TeluguAsianet News Telugu

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు పవర్ ఫుల్ పదవి..? 

ఒక్క సీటును గెలుచుకున్న స్థాయినుండి పోటీచేసిన ఒక్క సీటును వదలకుండా గెలిపించుకునే స్థాయికి పవన్ కల్యాణ్ చేరుకున్నారు. దీంతో తెలుగు సినిమాల్లో పవర్ స్టార్ కాస్త ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో పవర్ సెంటర్ గా మారారు.

Pawan Kalyan may become deputy CM or Home Minister of Andhra Pradesh AKP
Author
First Published Jun 6, 2024, 2:15 PM IST

అమరావతి : సినిమాల్లో పవర్ స్టార్ గా పేరుతెచ్చుకున్న పవన్ కల్యాణ్ రాజకీయాల్లోనూ పవర్ సెంటర్ గా మారారు. రీల్ లైఫ్ లో వకీల్ సాబ్ అనిపించుకున్న ఆయన నిజజీవితంలో మినిస్టర్ సాబ్ అనిపించుకోనున్నారట. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో కూటమి గెలుపులో ఎలాగైతే ముఖ్యపాత్ర పోషించారో... పాలనలోనూ అలాంటి పాత్రే పోషించనున్నారు. కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పవన్ కల్యాణ్ సేవలను ఉపయోగించుకోవాలని భావిస్తున్నారట... అందుకోసం తన కేబినెట్ లోకి తీసుకోవాలని చూస్తున్నారట. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు సమావేశమయ్యే సమయంలో ఈ ప్రతిపాదనను చంద్రబాబు పవన్ ముందు వుంచనున్నట్లు విశ్వనీయ సమాచారం.  

పవన్ కు డిప్యూటీ సీఎం, హోంమంత్రి పదవులు..?  

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఊహకందని విజయాన్ని కైవసం చేసుకుంది. కూటమిలో అత్యధిక సీట్లు సాధించింది తెలుగుదేశమే... కానీ గెలుపు క్రెడిట్ ఎక్కువగా పవన్ కల్యాణ్  కు దక్కుతోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ముందుగా చొరవ తీసుకుని టిడిపితో పొత్తుకు సిద్దమయ్యారు... అలాగే బిజెపిని కూడా కూటమిలోకి చేర్చింది కూడా పవనే. అలాగే వైసిపికి వ్యతిరేకంగా చాలా దూకుడుగా ప్రచారం చేపట్టారు. ఇలా సామ దాన భేద దండోపాయాలతో వైసిపిని మట్టికరిపించి టిడిపి కూటమిని విజేతగా నిలిపారు పవన్ కల్యాణ్. 

అంతేకాదు ఎన్నికల్లోనూ 100 శాతం రిజల్ట్స్ చూపించింది పవన్ సారథ్యంలోని జనసేన పార్టీ. పిఠాపురంలో పవన్ తో పాటు పోటీచేసిన 21 అసెంబ్లీ, 2 లోక్ సభ స్థానాల్లోనూ జనసేన విజయదుంధుభి మోగించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా పవన్ పొలిటికల్ స్టార్ గా గుర్తింపు పొందారు. చంద్రబాబే కాదు నరేంద్ర మోదీ, అమిత్ షా వంటి హేమాహేమీ నాయకులు సైతం పవన్ విక్టరీని పొగడకుండా వుండలేకపోతున్నారు. 

ఇలా టిడిపి కూటమి గెలుపులో కీలకపాత్ర పోషించిన పవన్ కల్యాణ్ ఇక పాలనలోనూ తనదైన మార్క్ చూపించనున్నారట. త్వరలోనే ఏర్పడే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆయన భాగస్వామ్యం కానున్నట్లు తెలుస్తోంది. ఎలాగూ ముఖ్యమంత్రి అయ్యేది చంద్రబాబు నాయుడు కాబట్టి ఆ తర్వాతి స్థానం పవన్ కే దక్కుతుందనే ప్రచారం జోరందుకుంది. డిప్యూటీ సీఎంతో పాటు కీలకమైన హోంమంత్రి పదవి పవన్ కు దక్కనుందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. 

కేంద్ర మంత్రి పదవి..? 

పవన్ కల్యాణ్ కు కేంద్ర మంత్రివర్గంలో చోటుదక్కే అవకాశాలున్నట్లు మరో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం టిడిపితో పాటు జనసేన కూడా ఎన్డిఏ లో భాగస్వామ్య పార్టీలు...  మూడోసారి నరేంద్ర మోదీ సర్కార్ ఏర్పడుతుందంటే అది చంద్రబాబు, పవన్ కల్యాణ్ సపోర్ట్ తోనే.  టిడిపి, జనసేనకు కలిపి 18మంది ఎంపీలున్నారు. 

అయితే ప్రస్తుతం పిఠాపురం ఎంపీగా వున్న పవన్ కల్యాణ్ ను రాజ్యసభకు పంపించి కేంద్ర మంత్రిగా చేయాలన్నది ఇటు టిడిపి, అటు జనసేన ఆలోచనగా తెలుస్తోంది. ఇందుకు బిజెపి కూడా సుముఖంగా వుందనే ఓ ప్రచారం కూడా జరుగుతోంది. ఇదే జరిగితే తన అన్న చిరంజీవి మాదిరిగానే పవన్ కల్యాణ్ కూడా కేంద్రమంత్రి అవుతారు. అయితే ఈ ఛాన్స్ చాలా తక్కువని జనసేన నాయకులే అంటున్నారు. 

పవన్ కు పదవులపై మరో వాదన : 

ప్రస్తుతం రాజకీయ వ్యవహారాల కారణంగా పవన్ కల్యాణ్ సినిమాలకు సమయం కేటాయించలేకపోతున్నారు. పార్టీ కార్యాకలాపాలతో ఇంత బిజీగా వుంటే ఇక ప్రభుత్వంలో భాగస్వామ్యమై మంత్రి పదవిని తీసుకుంటే ఇక సినిమాలకు దూరం కావాల్సిందే. సినిమాలను వదలడం ఇష్టంలేని పవన్ మంత్రి పదవిని వదులుకోడానికి సిద్దమైనట్లు సమాచారం. పార్టీ వ్యవహారాలను మాత్రం ఆయనే చూసుకోన్నాడట. 

ఇక జనసేన పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేల్లో వీలైనంత ఎక్కువమందికి కేబినెట్ చోటు కల్పించాలని మాత్రం చంద్రబాబును పవన్ కోరుతున్నారట. అలాగే పవన్ సోదరుడు నాగబాబుకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఛైర్మన్ గా నియమించే అవకాశాలున్నాయట. అలాగే తన పార్టీ ఎంపీలకు తగిన ప్రాధాన్యత కల్పించాలని ఎన్డిఏ పెద్దలను పవన్ కోరినట్లు సమాచారం. 


 
 


   


 

 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios