Pawan Kalyan: మధురైలో జరిగిన మురుగన్ మహాసభ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదైంది.
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై క్రిమినల్ కేసు నమోదైంది. జూన్ 22న మధురైలో జరిగిన మురుగన్ భక్తుల ఆధ్యాత్మిక మహాసభలో కోర్టు విధించిన నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలపై పవన్ కళ్యాణ్ తో పాటు తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు కే. అన్నమలై, హిందూ మున్నాని నేతలపై క్రిమినల్ కేసు నమోదైంది. ఈ కేసును మధురైలోని అన్నానగర్ పోలీస్‌స్టేషన్‌లో నమోదు చేశారు.
పవన్ పై ఫిర్యాదు చేసింది ఎవరు?
ఈ కేసుకు సంబంధించి ఫిర్యాదు చేసిన వ్యక్తి ఎస్. వంజినాథన్, మధురై పీపుల్స్ ఫెడరేషన్ ఫర్ కమ్యూనల్ హార్మనీ కోఆర్డినేటర్, ఆయన ఒక న్యాయవాది. ఆయన తన ఫిర్యాదులో ఈ సభలో చేసిన ప్రసంగాలు, ఆమోదించిన తీర్మానాలు మద్రాస్ హైకోర్టు విధించిన నిబంధనలను ఉల్లంఘించాయని ఆరోపించారు. హైకోర్టు ఈ సభను నిర్వర్తించడానికి అనుమతినిచ్చినా, రాజకీయ, మత ప్రచారాలపై ఖచ్చితమైన నిషేధం విధించింది.

చట్టపరమైన అభియోగాలు ఏమిటి?
ఈ కేసులో భారతీయ న్యాయ సంహిత (Bharatiya Nyaya Sanhita - BNS) క్రింద సెక్షన్లు 196(1)(a), 299, 302, 353(1)(b)(2) ప్రకారం అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసులో ప్రధాన నిందితులుగా కదేశ్వర సుబ్రమణ్యం - హిందూ మున్నాని అధ్యక్షుడు, ఎస్. ముత్తుకుమార్ - హిందూ మున్నాని రాష్ట్ర కార్యదర్శి, పవన్ కళ్యాణ్ - ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, కే. అన్నమలై - తమిళనాడు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, అలాగే ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ, హిందూ మున్నాని, ఇతర సంఘ్ పరివార్‌కు చెందిన నిర్వాహకులను కూడా నిందితులుగా పేర్కొన్నారు.
పోలీసులు ఏం చెప్పారంటే?
పోలీసుల ప్రకారం, సభలో చేసిన ప్రసంగాలు, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లు మతం, జాతి, ప్రాంతాల ఆధారంగా సామూహిక వైరం రెచ్చగొట్టేలా ఉన్నాయని తెలిపారు. ఈ సభ “ఆధ్యాత్మిక సమావేశం”గా ప్రచారం చేసినా.. కొంతమంది నాయకుల ప్రసంగాలు తాత్కాలిక శాంతిని భంగపర్చేలా ఉండటాన్ని పోలీసు అధికారులు పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్, అన్నమలై వ్యాఖ్యలు
పవన్ కళ్యాణ్, ఈ సభకు హాజరైనప్పుడు మురుగన్ భక్తుడిగా కనిపించారు. పవన్ "సెక్యులరిజం, హిందూ దేవుళ్లు, క్రిస్టియన్, ముస్లిం, మతాలు, హిందూ ధర్మం వంటి అంశాలతో తన ప్రసంగాన్ని కొనసాగించారు. అన్నమలై చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయ హీటును పెంచాయి.
అలాగే, ఈ సభలో ఆమోదించిన తీర్మానాలు కూడా వివాదంగా మారాయి. అందులో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో హిందువులు సమిష్టిగా ఓటు వేయాలన్న తీర్మానం, డీఎంకే ప్రభుత్వం దేవాలయాలను ఆదాయ వనరులుగా చూడటం మానేయాలన్న డిమాండ్ కూడా ఉంది.
ఈ సభను భారీ స్థాయిలో నిర్వహించారు. మురుగన్ ఆలయాల రూపాల మధ్య ఏర్పాటు చేసిన వేదికపై జరిగిన ఈ కార్యక్రమానికి లక్ష మందికిపైగా భక్తులు హాజరయ్యారని హిందూ మున్నాని ప్రకటించింది. ఐతే, బీజేపీ మిత్రపక్షమైన ఏఐఏడీఎంకే అధికారికంగా ఈ సభపై స్పందించలేదు. కానీ పార్టీకి చెందిన ఆర్.బి. ఉదయకుమార్, సెల్లూర్ కె. రాజు లాంటి సీనియర్ నేతలు సభకు హాజరయ్యారు.
