ఏపి ప్రయోజనాలు కాపాడటంలో కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు విఫలమైనట్లు పవన కల్యాణ్ ధ్వజమెత్తారు. బుధవారం జనసేన కార్యాలయం నుండి బడ్జెట్ పై తన అభిప్రాయాలు చెప్పారు. పనిలో పనిగా విభజన హామీలు, రాష్ట్రప్రయోజనాలపై రెండు ప్రభుత్వాల మీద మండిపడ్డారు. మూడున్నరేళ్ళుగా రెండు ప్రభుత్వాలు ప్రజలను మభ్యపెట్టినట్లు ధ్వజమెత్తారు. అందుకే మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్, లోక్ సత్తా వ్యవస్ధాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ లాంటి మేధావులతో ఓ ప్రెషర్ గ్రూపు అవసరమని తాను భావిస్తున్నట్లు చెప్పారు.

రాష్ట్ర సమస్యలపై పోరాడటానికి తానొక్కడి వల్లే ఏమీ కాదన్నారు. అందుకనే ప్రెషర్ గ్రూపు ఏర్పాటు గురించి మాట్లాడుతున్నట్లు తెలిపారు. విభజన సమస్యలను పరిష్కరిస్తారనే తాను పోయిన ఎన్నికల్లో మోడి, చంద్రబాబునాయుడుకు మద్దతు ఇచ్చినట్లు వివరించారు. అయితే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చటంలో రెండు ప్రభుత్వాలు విఫలమైనట్లు ఆరోపించారు. ప్రత్యేకహోదా కోసం రాజకీయ పోరాటం జరగాల్సిన అవసరాన్ని పవన్ నొక్కి చెప్పారు. టిడిపి ప్రభుత్వం అవినీతిలో నెంబర్ 1 స్ధానంలో ఉందని ఏజెన్సీలు నివేదికలు ఇవ్వటం చాలా బాధాకరమన్నారు.

కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన నిధులపై కేంద్రం ఒక రకంగాను, వచ్చిన నిధుల వ్యయంలో రాష్ట్రప్రభుత్వం మరోక రకంగాను చెబుతున్నాయన్నారు. కేంద్రం నుండి రాష్ట్రానికి వచ్చిన నిధులపై తాను చంద్రబాబును ఎన్నిసార్లు లెక్కలడిగినా ఇవ్వలేదన్నారు. ఇప్పటి పరిస్దితులు చూస్తుంటే పోయిన ఎన్నికల్లో ఎంఎల్ఏ, ఎంపి స్ధానాల్లో జనసేన కూడా పోటీ చేసి ఉంటే బాగుండేదని అనిపిస్తోందన్నారు. పోటీ చేయకుండా తాను తప్పు చేశానని ఇపుడనిపిస్తోందన్నారు. గురువారం రాష్ట్ర బంద్ పై తనకు పెద్దగా నమ్మకం లేదన్నారు.