జనవరిలో మళ్ళీ భాగస్వామ్య సదస్సా ?రూ. 7 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యమా ?మొన్నటి సదస్సులో వచ్చిన 4.5 లక్షల కోట్ల ఒప్పందాలేమయ్యాయి?
మళ్ళీ భాగస్వామ్య సదస్సా ? మొన్నటి సదస్సుకే దిక్కులేదు ఇప్పటి వరకూ. ఇంతలో మళ్ళీ సదస్సంటే నవ్వాలో ఏడ్వాలో కూడా ఎవరికీ అర్ధం కావటం లేదు. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ప్రభుత్వం జనవరిలో భాగస్వామ్య సదస్సును నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. మొన్నటి జనవరిలో రూ. 25 కోట్లు వ్యయం చేసి భారీ ఎత్తున నిర్వహించిన సదస్సులో ఏ మేరకు పెట్టుబడులు వచ్చాయని ఎవరూ ప్రభుత్వాన్ని అడగకూడదు.
జనవరిలో కూడా విశాఖపట్నం కేంద్రంగానే చంద్రబాబు నాయడు ప్రభుత్వం భారీ ఎత్తున మూడు రోజుల పాటు సదస్సు నిర్వహించింది. ఏ రాష్ట్రం అభివృద్ధిలోకి రావాలన్నా పెట్టుబడులు చాలా ముఖ్యమన్న సంగతి అందరికీ తెలిసిందే.
అందులో భాగంగానే సిఎం ఇటువంటి సదస్సుల నిర్వహణకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తుంటారు. మొన్నటి సదస్సులాగ రాబోయే సదస్సు కూడా సిఐఐ భాగస్వామ్యంలో ఏర్పాటు చేయటానికి పరిశ్రమల శాఖ చర్యలు తీసుకుంటోంది. ఇదే విషయమై ఉన్నతాధికారులకు దిశా నిర్దేశం చయటానికి ముఖ్యమంత్రి ఇప్పటికే సమావేశం కూడా నిర్వహించి తగిన ఆదేశాలు జారీ చేసింది.
మొన్నటి సదస్పు పూర్తవ్వగానే సుమారు రూ. 4.5 లక్షల కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టటానికి పారిశ్రామికవేత్తలు బాగా ఆశక్తి చూపుతున్నట్లు ముఖ్యమంత్రి మొదలు, మంత్రులు, ఉన్నతాధికారులు ఊదరగొట్టారు. దేశంలోనే ఉత్తమమైన పారిశ్రామిక విధానం అమలు చేయటంతోనే పారిశ్రామికవేత్తలందరూ ఏపిలో పెట్టుబడులు పెట్టటానికి క్యూ కడుతున్నట్లు విపరీతంగా ప్రచారం చేసుకున్నారు.
అక్కడితో సీన్ కట్ చేస్తే గడచిన పదిమాసాల్లో ఏ మేరకు పెట్టుబడులు వచ్చిందీ చెప్పమంటే ఎవరూ నోరు మెదపటం లేదు. ఇదే విషయమై ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నేతలు సమాచార హక్కుచట్టం ద్వరా అసలు విషయాన్ని బట్టబయలు చేసారు. పార్టీ నేత, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఏషియానెట్ తో మాట్లాడుతూ, పోయిన సారి నిర్వహించిన సదస్సుకు సంబంధించి ఒక్క రూపాయి పెట్టుబడిగా రాలేదని కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. ఒప్పందాలు మాత్రం రూ. 4.5 లక్షల కోట్లకు జరిగితే అవన్నీ పెట్టుబడులు కావన్నారు.
జరిగిన ఒప్పందాల్లో కేవలం పది శాతం సాకారమైనా సదస్సు నిర్వహణ విజయవంతమైనట్లేనన్నారు. అయితే, మొన్నటి జనవరిలో జరిగిన సదస్సు ఒప్పందాలన్నీ కాగితాలకే పరిమితమైనట్లు ఎద్దేవా చేసారు. అందులో ఒక్కటి కూడా సాకారం కాలేదన్నారు. పైగా రాబోయే జనవరి సదస్సులో రూ. 7 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా ముఖ్యమంత్రి చెప్పుకోవటం గమనార్హం.
