చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో తల్లిదండ్రులు ఇద్దరు కూతుళ్లను క్షుద్ర పూజలో మట్టుబెట్టిన ఘటనకు సంబంధించి కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పురుషోత్తంనాయుడు, పద్మజ దంపతుల చిన్న కూతురు సాయి దివ్య మూడు రోజుల క్రితం ఇన్ స్టా గ్రామ్ లో ఓ పోస్టు పెట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. 

శివ ఈజ్ కమ్.. వర్క్ ఈజ్ డన్ అనే పోస్టు పెట్టింది. ఆ పోస్టుపై పలు అనుమానాలు కలుగుతున్ాయి. ఇతర ప్రాంతాల నుంచి వ్యక్తులు వచ్చి తరుచుగా హత్యలు జరిగిన ప్రదేశంలో పూజలు చేసేవారని పోలీసులు గుర్తించారు. దాంతో ఆ ప్రదేశంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. 

Also Read: పేరెంట్స్ చేతిలో కూతుళ్ల హత్య: మరిన్ని విస్తుపోయే విషయాలు

ఇప్పటికే మృతుల తల్లిదండ్రులను అదుపులోకి తీసుగకుని పోలీసులు వారి ఇంట్లోనే విచారిస్తున్నారు. ఆ నివాసంలో దేవుళ్ల ఫొటోలతో పాటు చిత్ర విచిత్రమైన ఫొటోలను కూడా గుర్తించారు. వైద్యుల సలహాతో వారిద్దరిని అరెస్టు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. 

చిన్న కూతురు దివ్య వారం రోజుల నుంచి విచిత్రంగా ప్రవర్తిస్తోందని, ఇంటిపైకి ఎక్కి దూకేస్తానంటూ సందడి చేసిందని, దీంతో గాలి తగిలిందనే ఉద్దేశంతో పూజలకు పూనుకున్నట్లు తల్లి పద్మజ చెబుతోంది. అప్పటి నుంచి అక్కాచెల్లెళ్లిద్దరు వింతగా ప్రవర్తిస్తుండడంతో క్షుద్రపూజలకు చేశామని చెబుతోంది. 

See Video: ఉన్మాద భక్తి: వయసొచ్చిన కూతుళ్లను చంపిన తల్లి, తండ్రి సాక్షి

నాలుగు రోజులుగా పూజలు చేస్తున్నామని, అతీంద్రియ శక్తుల వల్ల దివ్య ఇంటిలోని తలుపులు కూడా తీసి పెట్టిందని, ఒక్కోసారి ఒక్కో రకంగా వింతగా ప్రవర్తించిందని చెప్పింది. పురుషోత్తంనాయుడు, పద్మజలపై హత్య నేరం కింద కేసు నమోదు చేశారు. అలేఖ్య, సాయి దివ్య శవాల పంచనామా జరిగింది.

పురుషోత్తంనాయుడి కుటుంబం నిరుడు ఆగస్టులో మదనపల్లె రూరల్ మండలం అంకిశెట్టిపల్లె పంచాయతీ శివనగర్ లో కొత్తగా నిర్మించిన ఇంట్లోకి వచ్చారు. వారు తరుచుగా పూజలు నిర్వహించేవారని స్థానికులు చెబుతున్నారు.