తెలుగుగంగ ద్వారా సోమశిల, కండలేరు ప్రాజెక్టుల నుండి నీటిని విడుదల చేయాలంటూ పన్నీర్ శెల్వం శుక్రవారం ఏకంగా విజయవాడకు వచ్చి చంద్రబాబును కలిసారు.

తమిళ తంబిల దాహార్తిని తీర్చేందుకు కనీసం 15 టిఎంసిల నీటిని అత్యవసరంగా విడుదల చేయాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి ఒ. పన్నీర్ శెల్వం విజ్ఞప్తి చేసారు. తెలుగుగంగ ద్వారా సోమశిల, కండలేరు ప్రాజెక్టుల నుండి నీటిని విడుదల చేయాలంటూ పన్నీర్ శెల్వం శుక్రవారం ఏకంగా విజయవాడకు వచ్చి చంద్రబాబును కలిసారు. ఈ సందర్భంగా ఇద్దరు సిఎంల మధ్య సుమారు గంటపాటు భేటీ జరిగింది.

తమిళనాడు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నట్లు తమిళనాడు సిఎం చంద్రబాబుతో చెప్పారు. చెన్నై నగర ప్రజలకు త్రాగు నీటికి కూడా బాగా ఇబ్బందిగా ఉన్న విషయాన్ని వివరించారు. పన్నీర్ శెల్వం వినతిని విన్న తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ, ఏపిలో కూడా వర్షాభావ పరిస్ధితులను వివరించారు. నీటి విడుదలకు ఏమాత్రం అవకాశాలున్నాయో ఉన్నతాధికారులతో చర్చించి తెలియజేస్తానని బదులిచ్చారు.

పన్నీర్ తో పాటు తమిళనాడు ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాధన్, ప్రభుత్వ సలహాదారు షీలా బాలకృష్ణన్ తదితరలు పాల్గొన్నారు. అంతుకుముందు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న పన్నీర్ శెల్వం బృందానికి హెచ్ఆర్డి మంత్రి గంటా శ్రీనివాస్ రావు, చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు తదితరులు స్వాగతం పలికారు. ఇద్దరు సిఎంల భేటీ అనంతరం, పన్నీర్ శెల్వం బృందం కనకదుర్గ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకున్నారు.