తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడికి ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే.. వరద ముంపులో ఉన్న లంక గ్రామాలైన బాడవ, వైవీ లంకలను పరిశీలించేందుకు ఎమ్మెల్యే బుధవారం పడవలో బయల్దేరారు.

పర్యటన ముగించుకుని గోదావరిలో చించినాడకు తిరిగొస్తుండగా నిమ్మల ప్రయాణిస్తున్న పడవ ఆకస్మాత్తుగా మొరాయించింది. అసలే గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుండటం, ఆపై పడవ మరమ్మత్తుకు గురవడంతో ఎమ్మెల్యే సహా సిబ్బంది ఆందోళనకు గురయ్యారు.

Also Read:తూర్పుగోదావరి జిల్లా లో వరద ఉధృతికి ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి

ఇంజన్ చెడిపోవడంతో పడవ నదీ ప్రవాహానికి వెనక్కి వెళ్లిపోతూ తూర్పుగోదావరి జిల్లా దిండి వైపు కొత్తగా నిర్మిస్తున్న రైల్వే వంతెన ఫిల్లర్లను ఢీకొంది. అయితే పడవను నడిపే వ్యక్తి అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి తాడు సాయంతో ఓ చెట్టుకు లంగర్ వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

దీనిపై నరసాపురం డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీలకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో వారు తూర్పుగోదావరి వైపున్న ఎన్డీఆర్ఎఫ్ దళాలు, యలమంచిలి ఎస్సై పడవపై వెళ్లి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సహా మిగిలిన వారిని సురక్షితంగా తీసుకొచ్చారు.