నెల్లూరు: ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా మహమ్మారి అడ్డూ అదుపు లేకుండా చెలరేగిపోతోంది. సామాన్యులే కాదు విఐపిలు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు సైతం ఈ వైరస్ బారినపడుతున్నారు. ఎప్పుడూ ప్రజల్లో వుండాల్సిన రాజకీయ నాయకులు చాలామంది ఇప్పటికే కరోనాకు చిక్కారు. తాజాగా నెల్లూరు జిల్లా సర్వేపల్లి వైసిపి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డికి కూడా కరోనా సోకింది. 

కొద్దిరోజులుగా కరోనా లక్షణాలతో బాధపడుతున్న ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డి తాజాగా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా తేలింది. దీంతో ఎమ్మెల్యే  వెంటనే చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరి చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే కాకాని కుటుంబసభ్యులకు కూడా అధికారులు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

తనకు కరోనా సోకినట్లు వెల్లడించిన ఎమ్మెల్యే త్వరలో పూర్తి ఆరోగ్యంతో బయటకు వస్తానన్న నమ్మకం వుందన్నారు. తన ఆరోగ్యంపట్ల అనుచరులు, నియోజకవర్గ వైసిపి కార్యకర్తలు, సన్నిహితులు ఆందోళన చెందవద్దని సూచించారు. అతి త్వరలోనే నియోజకవర్గంలో పర్యటిస్తానని... అప్పటివరకు కేవలం ఫోన్ లో మాత్రమే అందుబాటులో వుంటానని వెల్లడించారు.

read more  మరో రికార్డుకు చేరువలో తెలంగాణ కరోనా కేసులు... తాజాగా బయటపడ్డ కేసులెన్నంటే

ఇదిలావుంటే ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన తాజా బులెటిన్ ప్రకారం కొత్తగా 6,224 కేసులు నమోదవ్వడంతో మొత్తం కేసుల సంఖ్య 7,13,014కి చేరింది. ఒక్కరోజే వైరస్ కారణంగా 41 మంది ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 5,941కి చేరుకుంది.

ఇక 24 గంటల్లో 7,798 మంది కోలుకోవడంతో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 6,51,791కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 55,282 యాక్టివ్ కేసులున్నాయి. ఒక్కరోజే 72,861 శాంపిల్స్ పరీక్షంచడంతో ఇప్పటి వరకు మొత్తం టెస్టుల సంఖ్య 60,21,395కి చేరింది.

24 గంటల్లో అనంతపురం 282, చిత్తూరు 827, తూర్పు గోదావరి 824, గుంటూరు 491, కడప 491, కృష్ణ 392, కర్నూలు 225, నెల్లూరు 558, ప్రకాశం 619, శ్రీకాకుళం 175, విశాఖపట్నం 225, విజయనగరం 225, పశ్చిమ గోదావరిలలో 890 కేసులు నమోదయ్యాయి.

అలాగే కృష్ణ 6, చిత్తూరు 5, తూర్పు గోదావరి 5, గుంటూరు 4, ప్రకాశం 4, విశాఖపట్నం 4, నెల్లూరు 3, అనంతపురం 2, కడప 2, కర్నూలు 2, శ్రీకాకుళం 2, విజయనగరం, పశ్చిమ గోదావరిలలో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.