వైసీపీపై ఎన్‌టీఆర్ కుటుంబం ఆగ్రహం.. ఎవరు ఏమన్నారంటే?
వైసీపీపై ఎన్‌టీఆర్ కుటుంబం ఆగ్రహం వ్యక్తం చేసింది. మంత్రులు, నేతలపై ఫైర్ బాలకృష్ణ, రామకృష్ణలు సహా ఆ ఇంటి ఆడబిడ్డలు సీరియస్ అయ్యారు. రాజకీయాలు ఇంటి దాకా రావద్దని, కుటుంబ సభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే చేతులు ముడుచుకుని కూర్చోలేదని హెచ్చరించారు. మళ్లీ రిపీట్ కావద్దని అన్నారు. ఈ రోజు విలేకరుల సమావేశంలో ఎన్‌టీఆర్ కుటుంబ సభ్యులు భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలకు ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతి: అసెంబ్లీలో Bhuvaneshwari గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంపై NTR కుటుంబం భగ్గు మన్నది. రాజకీయాల్లో విమర్శలు ప్రతివిమర్శలు చేసుకోండని, వాటితో తమకు అభ్యంతరం లేదని, కానీ, వ్యక్తిగత దూషణలు, కుటుంబ సభ్యులపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna), నందమూరి రామకృష్ణలు YCP మంత్రులు, నేతలకు వార్నింగ్ ఇచ్చారు. తాము చేతులు కట్టుకుని కూర్చోలేదని, జాగ్రత్తగా మసులుకోండని హెచ్చరించారు. అంతేకాదు, ఎన్‌టీఆర్ ఇంటి ఆడబిడ్డలూ మీడియా సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు.
మీడియాతో ఇలా మాట్లాడటం తొలిసారి అని, ఇలాంటి ఘటన తమ కుటుంబంలో ఎప్పుడూ జరగలేదని బాలకృష్ణ సహోదరి లోకేశ్వరి ఆవేదన చెందారు. అసెంబ్లీ అంటే దేవాలయంతో సమానమని, అక్కడ ప్రజల కష్టసుఖాలు, పరిష్కారాలు గురించి చర్చిస్తారని, కానీ, ఇలా ఇష్టానుసారం మాట్లాడి అపవిత్రం చేస్తున్నారని వివరించారు. చంద్రబాబు విలపిస్తుంటే చూడలేకపోయామని, తమ చెల్లెలి బాధ చూడలేకపోతున్నామని చెప్పారు. ఆయన హయాంలో ఏనాడూ విజయమ్మ, భారతి, షర్మిల గార్లనూ ఏ మాట అనలేదని, తన పార్టీ వాళ్లనూ అననివ్వలేదని తెలిపారు. ఇలాంటి మాటలు మళ్లీ రిపీట్ కానివ్వకుంటే మంచిదని, తమలోనూ ఎన్‌టీఆర్ రక్తమే ఉన్నదని గుర్తుంచుకోండని అన్నారు.
Also Read: 'ఒరేయ్ నాని, వంశీ జాగ్రత్తగా ఉండండి.. గాజులు తొడుక్కుని కూర్చోలేదు'.. నందమూరి రామకృష్ణ వార్నింగ్..
బాలకృష్ణ సతీమణి వసుంధర మాట్లాడుతూ, ఈ వ్యాఖ్యలకు తాము చాలా బాధపడుతున్నామని, రాముడికి సీతాదేవి ఎలాగో చంద్రబాబుకు భువనేశ్వరి అలా అని అన్నారు. నందమూరి కుటుంబానికి భువనేశ్వరి శ్రీరామ రక్ష అని, అలాంటి మనిషి గురించి మాట్లాడినవారికి వారి ఇళ్లల్లోని ఆడవాళ్లే సమాధానం చెప్పాలని తెలిపారు.
తమ అత్తగారు ఏ రోజు పాలిటిక్స్‌లో కలుగజేసుకోలేదని, కుటుంబానికి సపోర్ట్‌గా ఉంటూ బిజినెస్‌లూ చూసుకుంటున్నారని దివంగత హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని అన్నారు. ఎన్‌టీఆర్‌ను తెలుగు ప్రజలు అన్నా అని ప్రేమగా పిలుచుకుంటారని, ఆయన కుమార్తెపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమని, రాజకీయాలు కుటుంబాల్లోకి రావద్దని హితవు పలికారు. తెలుగువారందరూ దీన్ని ఖండించాలని, భువనేశ్వరిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అందరికీ అవమానకరమే అని అన్నారు.
కొడాలి నానీ, వల్లభనేని వంశీ లాంటివాళ్లు రాజకీయ లబ్ది కోసం నీచాతినీచంగా తమ అత్త గురించి మాట్లాడటం, ఆమెను బలిపశువుని చేయడాన్ని ఖండిస్తున్నట్టు నందమూరి చైతన్యకృష్ణ అన్నారు. తమ అత్తలు భువనేశ్వరి, లోకేశ్వరి, పురంధేశ్వరిలను ఎన్‌టీఆర్ చాలా పద్ధతిగా పెంచారని, వారెప్పుడూ సాంప్రదాయంగా, అభిమానంతో మర్యాదగా వ్యవహరిస్తారని తెలిపారు. అలాంటి కుటుంబంలోని ఆడబిడ్డ భువనేశ్వరి గురించి అసభ్యకరంగా మాట్లాడుతారా? అంటూ మండిపడ్డారు. దీనిపై సీఎం జగన్ క్షమాపణలు చెబుతూ ప్రకటన విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అంతేకాదు, కొడాలి నానీని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.
Also Read: Nandamuri Balakrishna: చేతులు ముడుచుకుని కూర్చోం.. బద్దలు కొట్టుకుని వస్తాం.. బాలకృష్ణ వార్నింగ్
వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలని గారపాటి శ్రీనివాస్ వైసీపీ నేతలను హెచ్చరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక యువ సీఎం రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాడేమోనని ఆశించి ప్రజలు అధికారం ఇచ్చారని, కానీ, వైసీపీ నేతలు ఇలా అడ్డగోలుగా వ్యవహరించడం సరికాదని అన్నారు. అసెంబ్లీలో లేని వ్యక్తుల గురించి మాట్లాడకూడదని, కానీ, భువనేశ్వరి పేరు ఎత్తి.. చంద్రబాబు నాయుడి గారితో కంట నీరు పెట్టించారని మండిపడ్డారు.