పార్లమెంటు వేదికగా ఏపి జనాలకు ప్రధానమంత్రి నరేంద్రమోడి ఆవుకథ వినిపించారు. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్ నేపధ్యంలో ఏపి జనాలు భగ్గుమంటున్న విషయం తెలిసిందే. ప్రజాల స్పందన చూసిన తర్వాత వైసిపి ఎంపిలతో పాటు టిడిపి ఎంపిలు కూడా నిరసనలు, ఆందోళనలకు దిగాల్సిన అగత్యం వచ్చింది. అందుకే మూడు రోజులుగా టిడిపి, వైసిపి ఎంపిలు ఇటు రాజ్యసభ అటు లోక్ సభలో కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు.

బుధవారం ఉదయం నుండి రెండు పార్టీల ఎంపిలు దాదాపు ఏకమయ్యారా అన్నట్లుగా ఉభయ సభల్లోనూ ఆందోళనలు చేస్తున్నారు. మంత్రుల ప్రసంగాలను అడ్డుకున్నారు. అయితే, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేందుకు మోడి ప్రసంగం చేయాల్సి వచ్చింది. అపుడు టిడిపి ఎంపిలు తమ సీట్లలో కూర్చోగా వైసిపి ఎంపిలు మాత్రం వెల్ ల్లోనే ఆందోళనలు కొనసాగించారు. పదే పదే ప్రధాని ప్రసంగానికి అడ్డు తగిలారు.

ఎంపిల ఆందోళన మధ్య ప్రసంగాన్ని ప్రధాని మాట్లాడటానికి రెడీ అవ్వగానే స్పష్టమైన హామీ ఏదో వస్తుందని అందరూ అనుకున్నారు. అయితే ప్రసంగం మొదలుపెట్టటమే ఆవుకథతో మొదలుపెట్టారు. సమైక్య రాష్ట్ర విభజన జరిగిన తీరును ప్రస్తావించారు. ఎన్నికల్లో లబ్ది కోసమే కాంగ్రెస్ పార్టీ ఏపిని విభజించిందని మండిపడ్డారు. అప్పటికేదో విభజన పాపంలో బిజెపికి ఏ సంబంధమూ లేదన్నట్లు. ఎంపిల చేస్తున్న ఆందోళనేంటి? ప్రధాని ప్రస్తావిస్తున్న అంశాలేంటో ఎవరికీ అర్ధం కాలేదు.  

వాజ్ పేయ హయాంలో రాష్ట్రాల విభజన ఏ విధంగా జరిగింది, కాంగ్రెస్ హయాంలో జరిగిన తీరును ఎండగట్టారు. రాష్ట్ర విభజనతో ఏమాత్రం సంబంధం లేని నెహ్రూ హయాంను, రాజీవ్ గాంధి హయాంలో ఏపిలో జరిగిన ఘటనలను  గుర్తుచేశారు. కాంగ్రెస్ పనితీరు వల్లే ఎన్టీఆర్ తెలుగుదేశంపార్టీ పెట్టినట్లు చెప్పారు. తాము అబద్దాలు చేప్పే వాళ్ళం కాదని, చేయగలిగే పనులు మాత్రమే చెప్పి చేసి చూపిస్తామంటూ గొప్పలు చెప్పుకున్నారు. బహుశా పోయిన ఎన్నికల్లో ఏపి జనాలకు మోడి, చంద్రబాబు, పవన్ కల్యాణ్ జాయింటుగా చేసిన హామీలను మరచిపొయారేమో?

ప్రధాని ప్రసంగం మొత్తం మీద తమను తాము పొగుడుకుంటూ కాంగ్రెస్ ను తిట్టటంతోనే సరిపోయింది. విభజన సమస్యలకు పరిష్కారం చూపమంటే, విభజన చట్టం అమలు గురించి మాట్లాడమంటే ఏమాత్రం సంబంధం లేని అంశాలను ప్రస్తావించంతోనే నరేంద్రమోడి ప్రసంగంలోని డొల్లతనం ఏంటో అర్ధమైపోయింది.