విశాఖపట్టణం:విశాఖపట్టణంలోని ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీ నుండి గ్యాస్ లీకేజీ అయిన సమయంలో ఎలాంటి హెచ్చరికలు అందలేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఏదైనా ప్రమాదకర సమయం చోటు చేసుకొన్నప్పుడు అలారం మోగుతోంది. కానీ సైరన్ మోగని కారణంగా ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు.

గురువారం నాడు తెల్లవారుజామున  ఎల్జీ పాలీమర్స్ ఫ్యాక్టరీ నుండి  గ్యాస్ లీకైంది.గ్యాస్ లీకైన సమయంలో ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదని వెంకటాపురం గ్రామస్తులు మీడియాకు చెప్పారు.

ప్రమాదకర పరిస్థితులు చోటు చేసుకొన్న సమయంలో ప్రజలను అప్రమత్తం చేసే విధంగా  సైరన్ మోగేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

also read:విశాఖలో విషవాయువు లీకేజీ: ఆరా తీసిన మోడీ, సహాయక చర్యలకు ఆదేశం

ఈ వాయువు లీకైన సమయంలో ప్రజలంతా బయటకు వచ్చిన సమయంలో అధికారులు కానీ, పోలీసులు కానీ తమను ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని చెప్పలేదని వెంకటాపురం వాసి ఒకరు ఓ తెలుగు న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

సకాలంలో అధికారులు స్పందించి నిద్రలో ఉన్న వారిని కూడ లేపి ఇతర ప్రాంతాలకు తరలిస్తే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఫ్యాక్టరీ నుండి గ్యాస్ లీక్ కావడం వెనుక ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.