2019లో ఎవరితోనూ పొత్తుండదు

2019లో ఎవరితోనూ పొత్తుండదు

వచ్చే ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి పవన్ కల్యాణ్ స్పష్టత ఇచ్చేసారు. 2019 ఎన్నికల్లో జనసేనకు ఏ పార్టీతో కూడా పొత్తుండదని చెప్పారు. విశాఖపట్నంలోని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డిసిఐ) ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పవన్ మాట్లాడారు. డిసిఐ ను ప్రైవేటీకరించటాన్ని నిరసిస్తూ వెంకటేష్ అనే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, ప్రజా సమస్యలను పరిష్కరించలేని పార్టీలకు, నేతలకు ఓట్లడిగే నైతిక హక్కు లేదన్నారు. రాష్ట్ర విభజన  జరిగి ఇప్పటికి నాలుగేళ్ళవుతున్నా ఇంకా విభజన సమస్యలు అపరిష్కృతంగానే ఉందంటూ బాధ పడిపోయారు.

సమస్యల పరిష్కారం కోసమే తాను జనసేన పార్టీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తాను వచ్చే ఎన్నికల్లో టిడిపికి గానీ బాజపాకు కానీ మద్దతు ఇచ్చేది లేదన్నారు. పోయిన ఎన్నికల్లో చంద్రబాబు, నరేంద్రమోడి మ్యానిఫెస్టోలో ప్రస్తావించిన అంశాలను అమలు చేయాల్సిందేనంటూ హూంకరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అన్నీ రాజకీయ పార్టీలు కలిసి రావాల్సిందేనని తీర్మానించేసారు.

అధికారం అందుకోవాలన్నదే తన లక్ష్యం కాదన్నారు. అధికారం అందుకోవాలంటే ముందు కొంత అనుభవం కావాలన్నారు. పోయిన ఎన్నికల్లోనే తాను ఎంఎల్ఏ, ఏంపిగానో పోటీ చేసి ఉండేవాడిని అన్నారు. కానీ పోటీ చేయలేదన్నారు. ముందు సమస్యల అధ్యయనంపై తాను దృష్టి పెట్టినట్లు తెలిపారు. సమస్యలను పరిష్కరించేలేకపోతే భాజపా కు వ్యతిరేక ఓటు విశాఖపట్నం నుండే మొదలవుతుందని పవన్ స్పష్టంగా చెప్పారు. సమస్యలను పరిష్కరించలేని వాళ్ళకు ఎందుకు ఓట్లేయాలని జనాలను నిలదీసారు.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos