Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లాలో ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలు కలిగి ఉన్నాయనే అనుమానంతో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఒక వ్యక్తిని అరెస్టు చేసి, అదుపులోకి తీసుకుంది.
Andhra Pradesh: శాంతికి నిలయమైన శ్రీ సత్యసాయి జిల్లాలో ఒక్కసారిగా భయాందోళనలు మొదలయ్యాయి. ధర్మవరం పట్టణంలో ఉగ్ర కలకలం రేగింది. సాధారణంగా ఓ హోటల్‌లో వంటమనిషిగా పని చేసే వ్యక్తి అసలైన జీవితం మాత్రం వేరే దారిలో సాగుతుందన్న అనుమానాలు కలకలం రేపాయి. ఉగ్రవాద సంస్థలతో అతనికి సంబంధాలు ఉన్నాయన్న ఎన్ఐఏ ఆరా పట్టడంతో పట్టణం అంతా ఆందోళనకు గురైంది. ఆ వంటమనిషి ఇంట్లో ఏకంగా 16 సిమ్‌కార్డులు లభ్యమయ్యాయి. రహస్య సంభాషణల అనుమానాలు స్థానికుల్లో మరింత గందరగోళాన్ని పెంచాయి.
శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు కలకలం సృష్టించాయి. కోట కాలనీకి చెందిన నూర్ అనే అనుమానిత వ్యక్తిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. ధర్మవరంలోని ఓ హోటల్‌లో వంటమనిషిగా పనిచేస్తున్న నూర్ కు ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నాడని ఎన్‌ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ క్రమంలో నూర్ ఇంట్లో సోదాలు నిర్వహించగా, వారికి 16 సిమ్‌కార్డులు లభ్యమయ్యాయి. ఈ సిమ్‌కార్డుల ద్వారా ఆ వ్యక్తి ఎవరితో సంప్రదింపులు చేయడానే దానిపై ఎన్‌ఐఏ అధికారులు ఆరా తీస్తున్నారు. రెండు రోజుల క్రితం నూర్‌ను అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్లు సమాచారం.
ఇటీవల జరిగిన ఉగ్రవాద కార్యకలాపాలపై విచారణ జరుపుతున్న ఎన్ఐఏ అధికారులకు ధర్మవరంలో నూర్ అనే యువకుడికి టెర్రరిస్టులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఆపరేషన్‌ను ఎన్‌ఐఏ అత్యంత గోప్యంగా నిర్వహించింది. గత కొంతకాలంగా అధికారులు నూర్ కదలికలపై నిఘా పెట్టినట్టు తెలుస్తోంది. పక్కా సమాచారంతో అతడిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరింత సమాచారం సేకరించేందుకు అధికారులు దర్యాప్తు కొనసాగుతున్నారు. ఈ ఘటనతో ధర్మవరం ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.


