విశాఖ తల్లీబిడ్డల మృతికేసులో ట్విస్ట్... సంధ్య ఫోన్ నుండి చివరి కాల్ ఆ ఆటో డ్రైవర్ కే..!
విశాఖపట్నంలోని ఓ అపార్ట్ మెంట్ సంపులో వాచ్ మెన్ భార్య, ఇద్దరు పిల్లలు మృతదేహాలుగా తేలిన ఘటనలో ఓ ట్విస్ట్ భయటపడింది.
విశాఖపట్నం : ఇద్దరు పిల్లలతో సహా ఓ మహిళ నీటిసంపులో మృతదేహాలై తేలిన విషాద ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది. మొదట వీరిది ఆత్మహత్యగానే అందరూ భావించినా పోలీసుల విచారణలో కొత్త ట్విస్టులు బయటపడుతున్నాయి. ఆత్మహత్యకు ముందు మృతురాలి ఫోన్ నుండి ఓ ఆటో డ్రైవర్ కు కాల్ వెళ్లినట్లు బయటపడింది. మృతురాలి పిల్లలను రోజూ స్కూల్ కు తీసుకువెళ్ళే ఆటో డ్రైవర్ దే ఆ ఫోన్ నంబర్ గా గుర్తించారు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
విశాఖపట్నం మర్రిపాలెం ప్రకాష్ నగర్ లోని ఓ అపార్ట్ మెంట్ సెల్లార్ లో వాచ్ మెన్ కుటుంబంతో కలిసి నివాసముంటున్నారు. అయితే మంగళవారం అర్ధరాత్రి వాచ్ మెన్ బార్య సంధ్య, పిల్లలు గౌతమ్, అలేఖ్య అపార్ట్ మెంట్ నీటిసంపులో మృతదేహాలుగా తేలడం కలకలం రేపింది. పదినెలల క్రితమే విశాఖకు వచ్చిన వీరు ఇలా మృతిచెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. అసలు వీరిది ఆత్మహత్యా లేక మరేదైనా జరిగిందా అన్నది పోలీసుల విచారణలో తేలనుంది.
వాచ్ మెన్ భార్యాపిల్లల అనుమానాస్పద మృతిగురించి అపార్ట్ మెంట్ కు చెందిన ఓ మహిళ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గత రాత్రి 12:30 గంటల సమయంలో వాచ్ మెన్ వచ్చి తలుపుకొట్టాడని... బయటకు వచ్చి ఏమయ్యిందని అడగ్గా తన భార్యాపిల్లలు కనిపించడం లేదని చెప్పాడని తెలిపారు. నిద్రలో నుంచి తాను లేచి చూసేసరికి పక్కలో భార్య, పిల్లలు లేరని... ఎంత వెతికినా కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశాడని తెలిపింది.
Read More విశాఖలో విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా నీటి సంపులో దూకి తల్లి ఆత్మహత్య..
అయితే అపార్ట్ మెంట్ లోని మరికొందరితో కలిసి వాచ్ మెన్ భార్యాపిల్లల కోసం వెతికామని సదరు మహిళ తెలిపింది. అయితే నీటి సంపు తెరిచివుండటంతో అనుమానంతో అందులో పెద్ద కర్రపెట్టి చూడగా సంధ్యతె పాటు ఇద్దరు పిల్లలు మృతదేహాలు బయటపడ్డాయని మహిళ తెలిపింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలానికి చేరుకున్న వారు మృతదేహాలను సంపులోంచి బయటకు తీయించారు. తల్లీబిడ్డల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు.
అయితే మొదట మృతురాలి భర్త, సోదరుడితో పాటు మిగతా అందరూ తల్లీబిడ్డలది ఆత్మహత్యగా భావించారు. కానీ పోలీసులు సంధ్య మొబైల్ ను పరిశీలించగా అర్థరాత్రి ఆటో డ్రైవర్ కు కాల్ వెళ్లినట్లు బయటపడింది.దీంతో సంధ్య, ఇద్దరు బిడ్డల మృతిపై అనేక అనుమానాలు మొదలయ్యాయి.