విశాఖలో విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా నీటి సంపులో దూకి తల్లి ఆత్మహత్య..
ఓ అపార్ట్ మెంట్ వాచ్ మెన్ భార్య, తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన విశాఖపట్నంలో వెలుగు చూసింది. వేదింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ తల్లి, తన ఇద్దరు పిల్లలతో కలిసి నీటి సంపులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. రాత్రి 12:30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే ఆమె ఆత్మహత్యకి బావ, పెద్దమ్మ వేధింపులే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. ఒత్తిళ్ల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అపార్ట్మెంట్లో వాచ్మెన్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తి భార్య, పిల్లలు మృతి చెందడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. దీనికి సంబంధించి అపార్ట్మెంట్ లోని ఓ మహిళ మాట్లాడుతూ… రాత్రి 12:30 గంటల సమయంలో వాచ్మెన్ వచ్చి తలుపుకొట్టాడని తెలిపింది. తలుపు తీసి ఏంటి అని ప్రశ్నించగా.. తన భార్య, పిల్లలు కనిపించడం లేదని చెప్పాడు. ఇంత రాత్రివేళ ఎక్కడికి వెళ్లి ఉంటారని అడగగా.. నిద్రలో నుంచి తాను లేచి చూసేసరికి పక్కలో భార్య, పిల్లలు లేరని వెతికినా కనిపించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
అపార్ట్మెంట్లోని నీటి సంపు తెరిచి ఉందని తెలిపాడు. దీంతో మేము అందరం కూడా కలిసి వెతికాం. కాసేపటికి సంపులో మలవిసర్జన కనిపించింది. అందరూ వాడుకునే నీళ్లు.. తాగే నీటిలో.. ఇది ఎలా వచ్చిందని.. అనుమానంతో.. సంపులో కర్ర పెట్టి చూడగా…ఏమీ కనిపించలేదు. పక్క బిల్డింగ్ వాచ్మెన్ ను పిలిచి చూడమనగా.. లోపల ఏదో కదులుతున్నట్టుగా అనిపిస్తుందని తెలిపాడు.
వెంటనే కర్రకు ఇనుప చువ్వ తగిలించి మరింత లోతుగా పెట్టి చూడగా.. వాచ్మెన్ భార్య నైటీకి తగిలి ఆమె బయటికి వచ్చింది. అలా ముగ్గురు మృతి చెందిన విషయం వెలుగు చూసింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించామని తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటన మీద మృతురాలి సోదరుడు మాట్లాడుతూ.. తన చెల్లిని భర్తకు వరుసకు సోదరుడైన వ్యక్తి వేధింపులకు గురి చేసేవాడని.. దీంతో ఆయన మీద కేసు నమోదు చేశారని తెలిపాడు. ఆ కారణంగానే తమ ఊరి నుంచి విశాఖపట్నం వచ్చి ఇక్కడ ఉంటున్నారని తెలిపారు. కాగా, కేసు పెట్టారని బావ వేదింపులకు గురి చేస్తుండడంతో మనస్థాపంతో ఆత్మహత్య చేసుకునే ఉండొచ్చని అంటున్నాడు.
రాత్రి 9:30 వరకు బాగానే ఉన్నారని.. పిల్లలకు, భర్తకు వంట కూడా చేసి పెట్టిందని.. గంటల వ్యవధిలోనే ఇలా జరగడం విషాదమని అక్కడున్న వారు అనుకుంటున్నారు. దీనిమీద పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.